KCR: జిత్తన్నా.. ఎట్లున్నవ్‌!

ప్రధానాంశాలు

KCR: జిత్తన్నా.. ఎట్లున్నవ్‌!

తెరాస సీనియర్‌ నేతతో కేసీఆర్‌ సంభాషణ

జగిత్యాల, న్యూస్‌టుడే: జగిత్యాలకు చెందిన తెరాస సీనియర్‌ నాయకుడు, నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జి మాకునూరి జితేందర్‌రావును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆప్యాయంగా పలకరించారు. సోమవారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమానికి వచ్చిన సీఎం కేసీఆర్‌ ‘జిత్తన్నా.. ఎట్లున్నవ్‌.. ఎక్కడుంటున్నవ్‌’ అంటూ యోగక్షేమాలు అడిగారు. ‘జగిత్యాలలోనే ఉంటున్నా, వ్యవసాయం చేస్తున్నా’ అంటూ జితేందర్‌రావు బదులివ్వగా ఏయే పంటలు వేస్తున్నావని సీఎం అడిగారు. వరి సంగతేంటని వివరాలు తెలుసుకున్నారు. ‘నీళ్లు, కరెంటు ఇస్తిరి.. వద్దంటే వరి వేస్తున్నారు. దానికి బదులు వాణిజ్యపంటలు మంచి లాభాలు తెస్తాయి’ అని జితేందర్‌రావు చెప్పారు. తాను అరటి సాగు చేశానని ఎకరానికి రూ.లక్ష మిగులుతున్నాయని, మార్కెటింగ్‌ సౌకర్యంతోపాటు ఉద్యానశాఖ ప్రోత్సాహం ఉంటే మరింత బాగుండేదని పేర్కొన్నారు. కొందరు చెరకు, ఆవాలు, సజ్జలు వేస్తున్నారని, మంచి లాభాలు వస్తున్నాయని జితేందర్‌రావు వివరించారు. తమ గ్రామంలో అయిదెకరాల్లో డ్రిప్‌ పద్ధతిలో ఈత చెట్లు నాటామని, నీరాతో గీత కార్మికులు మంచి ఆదాయం పొందుతున్నారని చెప్పారు. త్వరలోనే ప్రగతిభవన్‌కు ఆహ్వానిస్తానని సీఎం ఆయనతో అన్నారు. అనంతరం మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావులు సైతం జితేందర్‌రావుతో మాట్లాడగా.. అంతర్గాంలో రహదారి మంజూరు చేయాలని ఆయన కోరారు. వెంటనే మంజూరు చేస్తామని వారు చెప్పారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని జితేందర్‌రావు కేటీఆర్‌కు వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని