హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనం కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ప్రధానాంశాలు

హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనం కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ఈనాడు, దిల్లీ: హైదరాబాద్‌ నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనంపై ఆంక్షలు విధిస్తూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌చేస్తూ జీహెచ్‌ఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. బుధవారం ఈ అంశాన్ని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. నిమజ్జనంపై హైకోర్టు ఉత్తర్వులు చివరి నిమిషంలో వెలువడినందున ఈ సంవత్సరం అందులో కొన్ని మినహాయింపులు కోరుతున్నట్లు ధర్మాసనానికి విన్నవించారు. కోర్టు ఉత్తర్వుల్లోని చాలా అంశాలకు తాము కట్టుబడి ఉంటామని, ఒకట్రెండు అంశాలను మాత్రం తక్షణం అమలు చేయలేమన్న తుషార్‌ మెహతా.. ఈ కేసును గురువారం లిస్ట్‌ చేయాలని కోరారు. అందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అంగీకరించారు.

ప్లాట్ల కేటాయింపు కేసును విచారణకు స్వీకరించండి

హైదరాబాద్‌లో శాసనసభ్యులు, బ్యూరోక్రాట్లకు ప్రభుత్వ ప్లాట్ల కేటాయింపు అంశం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉందని, ఈ విషయంలో జోక్యం చేసుకుని కేసును విచారణకు స్వీకరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణకు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా విజ్ఞప్తి చేశారు. ఈ ప్లాట్లతో కొందరికి అత్యంత అవసరం ఉందని, మరికొందరు వాటిని దాతృత్వ హృదయంతో ట్రస్టులు, సమాజసేవ చేసే వారికి బదిలీ చేయాలనుకుంటున్నారని వివరించారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ కేసు విచారణకు రావడంలేదన్నారు. సీజేఐ స్పందిస్తూ ‘ఆ కేసు నంబర్‌ చెప్పండి.. పరిశీలిస్తాం’ అన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని