కమిటీ సిఫార్సులపై కార్యాచరణ సమర్పించండి

ప్రధానాంశాలు

కమిటీ సిఫార్సులపై కార్యాచరణ సమర్పించండి

 చిన్నపిల్లలకు వైద్య సేవలపై దృష్టిసారించాలి

కొవిడ్‌పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: విపత్తుల నిర్వహణ చట్టం కింద ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ కొవిడ్‌ నియంత్రణకు చేసిన సిఫార్సులపై కార్యాచరణ నివేదికను సమర్పించాలని ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కమిటీ సిఫార్సుల అమలుకు తీసుకున్న చర్యల నివేదికను అందజేయాలంది. మూడో దశ చిన్నపిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో వారి కోసం నీలోఫర్‌ ఆస్పత్రిలోనే కాకుండా అన్ని జిల్లాల్లో వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ వివరాలతోపాటు మూడో విడతను ఎదుర్కోవడానికి సంసిద్ధత ప్రణాళికను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. కొవిడ్‌పై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రారావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ సీరో సర్వైలైన్స్‌ కోసం రూ.1.48 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఉన్నతస్థాయి కమిటీ జులై 15న సమావేశమైందని చెప్పారు. జ్వరాలపై సర్వే నిర్వహించాలని, ఆక్సిజన్‌, ఐసీయూ బెెడ్‌ల కొరత లేకుండా చూడటంతోపాటు కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని సూచించిందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఈ సూచనల అమలుకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలను పెంచాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌కు సూచించింది. కొన్ని ప్రాంతాల్లో ఉపాధ్యాయులకు కరోనా సోకినట్లు వార్తలొస్తున్నాయని, విద్యార్థులు మహమ్మారి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలంది. ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు సమాధానమిస్తూ కరోనాతోపాటు జ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, మూడో విడతను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్రం తరఫున సహాయ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.రాజేశ్వరరావు వాదనలు వినిపిస్తూ కొవిడ్‌ మందులను అత్యవసర మందుల జాబితాలో చేర్చడానికి సంబంధించిన నివేదిక సమర్పించడానికి గడువు కావాలని కోరారు. ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని