పూనం మాలకొండయ్యకు నాన్‌బెయిలబుల్‌ వారంట్‌

ప్రధానాంశాలు

పూనం మాలకొండయ్యకు నాన్‌బెయిలబుల్‌ వారంట్‌

 కోర్టు ధిక్కరణ కేసులో గైర్హాజరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

ఈనాడు, అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో విచారణకు గైర్హాజరయినందుకు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసింది. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని ప్రాథమికంగా నిర్ధారించిన హైకోర్టు.. ఈ వ్యవహారంపై తుది తీర్పు ఇవ్వడానికి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. చాలా ఏళ్లుగా పట్టుపరిశ్రమ శాఖలో సేవలందించినందుకు తమ ఉద్యోగాలను 1993 నవంబరు నుంచి క్రమబద్ధీకరించాలని, దాని ఆధారంగా పెన్షనరీ ప్రయోజనాలను లెక్కించి ఇవ్వాలని 2020 ఫిబ్రవరి 28న ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయలేదంటూ 17 మంది విశ్రాంత ఫుల్‌ టైమ్‌ కాంటిజెంట్‌ ఉద్యోగులు హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం వేశారు. ఆ రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పట్టుపరిశ్రమ కమిషనర్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారి చిరంజీవి చౌదరిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

గత ఆదేశాల మేరకు ఆ ముగ్గురు అధికారులు హైకోర్టులో బుధవారం విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఎస్‌ఎస్‌ రావత్‌, చిరంజీవిచౌదరి మాత్రమే విచారణకు వచ్చారు. పూనం మాలకొండయ్య హాజరు కాలేదు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశామన్నారు. ఆ పిటిషన్‌ కోర్టు ముందున్న రికార్డుల్లో లేదని స్పష్టం చేసిన న్యాయమూర్తి..  గైర్హాజరైనందుకు పూనం మాలకొండయ్యపై నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని