మాదక ద్రవ్యాల వినియోగంపై 12 కేసులు నమోదు చేశాం

ప్రధానాంశాలు

మాదక ద్రవ్యాల వినియోగంపై 12 కేసులు నమోదు చేశాం

హైకోర్టుకు నివేదించిన ఎక్సైజ్‌శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరాకు సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని.. 2017 నుంచి 12 కేసులు నమోదు చేశామని హైకోర్టుకు రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ నివేదించింది. తమ అధికారులు పలువురు సినీ నటులను విచారించారని తెలిపింది. 12 కేసులకు సంబంధించిన అభియోగ పత్రాలతోపాటు అన్ని పత్రాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కి అందజేశామంది. మాదక ద్రవ్యాల కేసుల్లో ప్రముఖులు ఉన్నందున కేంద్ర సంస్థలకు దర్యాప్తు అప్పగించేలా ఆదేశించాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం విదితమే. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసుల వివరాలను సమర్పించేలా ఆదేశించాలంటూ ఈడీ మధ్యంతర పిటిషన్‌ వేసింది. వీటిపై రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లు, రిమాండ్‌ రిపోర్టులు, అభియోగ పత్రాలు తదితరాలన్నింటినీ ఈడీకి అందజేసినట్లు పేర్కొన్నారు. నాంపల్లి కోర్టులో 8, రంగారెడ్డి జిల్లా కోర్టులో 4.. మొత్తం 12 అభియోగ పత్రాలు దాఖలు చేశామన్నారు. వీటిని గత డిసెంబరులోనే ఈడీకి అందజేశామన్నారు. సీజ్‌ చేసిన వాటి వివరాలతోపాటు డిజిటల్‌ ఎవిడెన్స్‌, వాంగ్మూలాలను(స్టేట్‌మెంట్లను) నేరుగా కోర్టుకు అందజేశామని, ప్రస్తుతం కేసులు విచారణలో ఉన్నందున తమ వద్ద అందుబాటులో లేవన్నారు. ఈడీ పిటిషన్‌ను కొట్టివేయాలని కౌంటర్‌లో కోరారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని