నేరాల విచారణలో తెలంగాణ ముద్ర

ప్రధానాంశాలు

నేరాల విచారణలో తెలంగాణ ముద్ర

నాలుగో స్థానంలో రాష్ట్రం

ఈనాడు, హైదరాబాద్‌: నేరస్థులను పట్టించడంలో వేలిముద్రల(ఫింగర్‌ ప్రింట్స్‌)దే కీలకపాత్ర. వీటి ద్వారా నేరస్థులను పట్టుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ.. దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. గురువారం జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) ‘భారతదేశంలో వేలిముద్రలు’ పేరిట 2020 సంవత్సరానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. గతేడాది నేరాల విచారణ కోసం సేకరించిన వేలిముద్రలు, వాటి ఆధారంగా పట్టుకున్న నిందితులు, కేసుల వివరాలను ఇందులో పేర్కొన్నారు. రాష్ట్రంలో గతేడాది 356 కేసుల్లో ఫింగర్‌ ప్రింట్స్‌ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. ఈ అంశంలో కేరళ మొదటి స్థానంలో ఉంది. వీటి ఆధారంగా ఆ రాష్ట్రంలో 657 కేసుల్లో నిందితుల్ని పట్టుకున్నారు. అలాగే.. నేరస్థలం నుంచి వేలిముద్రలను సేకరించిన అంశంలో మన రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. గత సంవత్సరం నేరస్థలం నుంచి 6,256 వేలిముద్రలు సేకరించగలిగారు. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్‌(9,397) మొదటి స్థానం, కేరళ(8,807) రెండో స్థానంలో ఉంది. ఇక అరెస్టయిన వారి నుంచి సేకరించిన ఫింగర్‌ ప్రింట్స్‌(11,668) అంశంలో రాష్ట్రం 8వ స్థానంలో ఉంది. సంఘటనా స్థలంలో వేలిముద్రలను సేకరించి, అక్కడికక్కడే విశ్లేషణ జరుపుతున్న కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దీనికి సంబంధించిన ఉదాహరణలను కూడా ఎన్‌సీఆర్‌బీ పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 2020, ఆగస్టు 11న జరిగిన ఓ దొంగతనం కేసును పోలీసులు వేలిముద్రల ద్వారా ఛేదించగలిగారు. ఆ సంఘటనా స్థలం నుంచి 4 వేలిముద్రలను సేకరించగా.. వాటిలో ఒకటి గతంలో 16 నేరాలు చేసిన అదే పట్టణానికి చెందిన పూసా శ్రీను ఫింగర్‌ ప్రింట్‌తో సరిపోయింది. వికారాబాద్‌లో జరిగిన మరో దొంగతనం కేసులోనూ.. సంఘటనా స్థలం నుంచి సేకరించిన వేలిముద్రల ద్వారానే ఇద్దరు నిందితుల్ని గుర్తించగలిగారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని