అటవీ సిబ్బందిపై దాడులు సరికాదు

ప్రధానాంశాలు

అటవీ సిబ్బందిపై దాడులు సరికాదు

‘పోడు’పై మంత్రివర్గ ఉపసంఘం నేడు తొలి భేటీ: మంత్రి ఇంద్రకరణ్‌

ఈనాడు, హైదరాబాద్‌: అటవీసిబ్బందిపై దాడులు సరికాదని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అజంనగర్‌ అటవీరేంజ్‌ పందిపంపులలో గురువారం అటవీ అధికారులు, సిబ్బందిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. శుక్రవారం మంత్రి హైదరాబాద్‌ అరణ్యభవన్‌ నుంచి బాధిత రేంజ్‌ అధికారి గూడూరి దివ్య, సిబ్బందితో దృశ్యమాధ్యమం ద్వారా మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అటవీభూమిలో నాటిన నాలుగు వేల పండ్ల మొక్కలను తొలగించి పోడుదారులు సాగు ప్రయత్నం చేశారని, గతంలో ఒకసారి ఇలాగే చేస్తే అటవీభూమిని ఆక్రమించబోమని లిఖితపూర్వక హామీ తీసుకున్నామని రేంజ్‌ అధికారి దివ్య మంత్రికి వివరించారు. ఈ తరహా దాడులు పునరావృతం కాకుండా నిందితులకు సరైన శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అటవీశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఎ.శాంతికుమారి వారికి భరోసా ఇచ్చారు. కలెక్టర్‌ నేతృత్వంలో జిల్లాల వారీగా ఏర్పాటైన ఫారెస్ట్‌ ప్రొటెక్షన్‌ కమిటీలు ఇలాంటి సంఘటనలపై తక్షణం స్పందించాలని పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ సూచించారు. రాష్ట్ర అటవీ అధికారులు సంఘం, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారుల సంఘం, జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు కూడా దాడి ఘటనను ఖండించారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ఈ విషయంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం తొలి భేటీ శనివారం ఉంటుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని