పెట్టుబడులకు తెలంగాణ అత్యుత్తమం

ప్రధానాంశాలు

పెట్టుబడులకు తెలంగాణ అత్యుత్తమం

జర్మనీ, ఉజ్బెకిస్థాన్‌ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

ఆ దేశ రాయబారులతో మంత్రి కేటీఆర్‌ భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: భారతదేశంలో అత్యధిక విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న తెలంగాణలో జర్మనీ, ఉజ్బెకిస్థాన్‌ దేశాల పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు సహకరించాలని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు ఆ దేశ రాయబారులు వాల్టర్‌ జే లిండార్‌, దిల్షోడ్‌ అఖతోవ్‌లను కోరారు. ఆయా దేశాల పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించి ప్రత్యేక పార్కుల ఏర్పాటుతో పాటు రాయితీలు, ప్రోత్సాహకాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. శుక్రవారం లిండార్‌, అఖతోవ్‌లు మంత్రి కేటీఆర్‌తో ప్రగతిభవన్‌లో విడివిడిగా సమావేశమయ్యారు. వారిని కేటీఆర్‌ సత్కరించి, జ్ఞాపికలను అందించారు. అనంతరం వివిధ రంగాల్లో రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక విధానం, మౌలిక వసతుల గురించి దృశ్యరూపక ప్రదర్శన ఇచ్చారు. లిండార్‌తో భేటీలో తెలంగాణ ఇంజినీరింగ్‌ పట్టభద్రులు జర్మనీకి వెళ్లేందుకు సహాయ సహకారాల గురించి ఆరా తీశారు. జర్మనీలోని ప్రసిద్ధ వాహన, తయారీ పరిశ్రమల దిగ్గజాలతో సమావేశం నిర్వహించి పెట్టుబడులకు ప్రోత్సహించాలన్నారు. అనంతరం అఖతోవ్‌ బృందంతో భేటీ సందర్భంగా రాష్ట్రంలో ఔషధ, ఇంజినీరింగు రంగాల్లో పెట్టుబడి అవకాశాలను వివరించారు. రెండు దేశాల రాయబారులు మాట్లాడుతూ తెలంగాణ, జర్మనీ పారిశ్రామిక వర్గాల మధ్య సమన్వయం కుదిర్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ ఈ భేటీల్లో పాల్గొన్నారు.

* రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీని ఉజ్బెకిస్థాన్‌ రాయబారి దిల్షోడ్‌ అఖతోవ్‌ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని