ఆవిష్కరణలకు ప్రోత్సాహం

ప్రధానాంశాలు

ఆవిష్కరణలకు ప్రోత్సాహం

ప్రాథమిక విద్య నుంచే ప్రతిభను చాటాలి

విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ పిలుపు

తెలంగాణ పాఠశాలల ఆవిష్కరణల సవాలు-2021 కార్యక్రమం ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరణలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు. పాఠశాలల స్థాయి నుంచే విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలకు కార్యరూపం ఇచ్చి ప్రతిభను చాటుకోవాలని, దీనికి అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. నేటి చిన్నారులే రేపటి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నది తమ సంకల్పమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆవిష్కరణల విభాగం(టీఎస్‌ఐసీ), విద్యాశాఖ, యునిసెఫ్‌, యువా, ఇంక్వి-ల్యాబ్‌ ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో నిర్వహించే పాఠశాలల ఆవిష్కరణల సవాలు (స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌)-2021 కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రగతిభవన్‌లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోడపత్రికను విడుదల చేశారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఆవిష్కరణలతో అన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చన్నారు. ప్రతీ ఒక్కరిని ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో ఇంటింటా ఆవిష్కరణల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. పాఠశాలల స్థాయిలో విద్యార్థుల మనసులోని ఆలోచనలను ఆచరణలోకి తెచ్చేందుకు వేదికగా టీఎస్‌ఐసీ రెండేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చెప్పారు. ఇది విద్యార్థుల స్వావలంబనకు ఉపయోగపడుతుందని తెలిపారు. సబితారెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థులకు ఆవిష్కరణల సవాలు గొప్ప వేదిక అన్నారు. అందరూ ఉత్సాహంగా పాల్గొని గొప్ప ఆవిష్కర్తలుగా ఎదగాలని కోరారు. పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ మాట్లాడుతూ.. ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా అయిదు వేలకుపైగా ఉన్నత, మాధ్యమిక పాఠశాలలు, గురుకులాలు, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేస్తామన్నారు. ముగ్గురు విజేతలకు నగదు బహుమతి ఇవ్వడంతో పాటు ఫైనల్‌కు చేరిన వారందరికీ ఇంక్యుబేషన్‌ సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ సుల్తానియా, టీఎస్‌ఐసీ సీఐవో శాంత, యునిసెఫ్‌, యువా, ఇంక్వి-ల్యాబ్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని