గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించిన ఎన్జీటీ కమిటీ

ప్రధానాంశాలు

గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించిన ఎన్జీటీ కమిటీ

అక్కన్నపేట (హుస్నాబాద్‌ గ్రామీణం) న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టును జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు బుధవారం పరిశీలించారు. శ్రీరాంసాగర్‌ వరద కాలువ నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.41 టీఎంసీల నుంచి 8.23 టీఎంసీలకు పెంచగా, అందుకు పర్యావరణ అనుమతులు లేవని ఆరోపిస్తూ గుడాటిపల్లి సర్పంచి బద్దం రాజిరెడ్డి ఆధ్వర్యంలో కొందరు నిర్వాసితులు ఎన్జీటీని ఆశ్రయించారు. దీనిపై పరిశీలించి, నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ)ను కోరింది. అందుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, కేంద్ర జలసంఘం, జీఆర్‌ఎంబీకి చెందిన ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు పీఎస్‌ కుత్యాల్‌, రమేశ్‌కుమార్‌, డాక్టర్‌ ఆరోకియా లెనిన్‌ ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలను, పంప్‌హౌస్‌ పనులను పరిశీలించారు. భూసేకరణ, పరిహారం, ప్యాకేజీ, ప్రాజెక్టు పనుల ప్రగతిని తెలుసుకున్నారు. నిర్వాసితులు, పిటిషనర్లతో మాట్లాడారు. ఇంకా కొందరికి పునరావాస ప్యాకేజీ, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములకు పరిహారం రావాల్సి ఉందని నిర్వాసితులు వారికి తెలిపారు. రెండోసారి ముంపునకు గురవుతున్నందున మళ్లీ పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని, నిర్వాసితులందరికీ రెండు పడకగదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కమిటీ వెంట నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ (ప్రాజెక్టులు) బి.శంకర్‌,, ఎస్‌ఈ సుమతీదేవి, ఈఈలు రాములు నాయక్‌, రమేశ్‌, వెంకటేశ్వర్లు, ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఏసీపీ సతీష్‌ తదితరులున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని