కేంద్ర పథకాల కింద రూ.236 కోట్లు విడుదల చేయండి

ప్రధానాంశాలు

కేంద్ర పథకాల కింద రూ.236 కోట్లు విడుదల చేయండి

 కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలకు తలసాని వినతి

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో పశుసంవర్ధకశాఖ అభివృద్ధి కోసం 2021-22 సంవత్సరానికి సమర్పించిన ప్రణాళికను అనుసరించి కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రూ.236 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కేంద్రాన్ని కోరారు. ఆయన బుధవారం ఎంపీలు బండా ప్రకాశ్‌, బడుగుల లింగయ్యయాదవ్‌, ఉన్నతాధికాలరులతో కలిసి కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలతో సమావేశమయ్యారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలో 60 లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా పశుసంపదపై ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పారు. పశుసంవర్ధక, డెయిరీ, మత్స్యరంగాలపై ప్రత్యేక దృష్టిసారించి రాష్ట్రం విభిన్న పథకాలు అమలుచేస్తోందని, లక్ష్య సాధన కోసం కేంద్రం సహకరించాలని కోరారు. కేంద్రమంత్రితో భేటీ అనంతరం తలసాని విలేకర్లతో మాట్లాడుతూ గొల్లకురుమలు, మత్స్యకారులకు సబ్సిడీపై ఇచ్చే ప్రయోజనాల గురించి చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న మెగా డెయిరీకి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తిచేసినట్లు వెల్లడించారు. మత్స్య, గొర్రె మాంసం ఉత్పత్తులను బ్రాండింగ్‌ చేసి ఉత్పత్తిదారులకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తామన్నారు. చెరువులు, కుంటలు, కాలువలను దేశంలోనే తొలిసారి జియోట్యాగ్‌ చేసినందుకు కేంద్రమంత్రి తెలంగాణను అభినందించినట్లు తలసాని చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని