‘ఆసరా’ కోసం ఆశగా ఎదురుచూపులు

ప్రధానాంశాలు

‘ఆసరా’ కోసం ఆశగా ఎదురుచూపులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆసరా పింఛన్ల మంజూరు కోసం ప్రభుత్వం కొత్తగా స్వీకరించిన 7.4 లక్షల దరఖాస్తుల పరిశీలన ఇంకా మొదలు కాలేదు. అర్హత కనీస వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిన సర్కారు ఆ మేరకు ఆగస్టు 31 గడువుగా పేర్కొని దరఖాస్తులు తీసుకుంది. గ్రామాలు, మున్సిపాలిటీలు, నగరాల్లో అర్హులైన లబ్ధిదారులు దాదాపు 7.4 లక్షల మంది ఆన్‌లైన్లో దరఖాస్తు చేశారు. గతంలోని నిబంధనల మేరకు దరఖాస్తుల పరిశీలన ఉంటుందని అధికారులు పేర్కొన్నప్పటికీ, క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీకాలేదు. దీంతో పంచాయతీ కార్యదర్శులు, జీహెచ్‌ఎంసీ పరిధిలో రెవెన్యూ అధికారులు ఆ దరఖాస్తుల్ని పక్కనపెట్టారు. తెలంగాణలో వృద్ధాప్య పింఛన్లకు ఇప్పటివరకు 65 ఏళ్ల నిబంధన అమలైంది. దీన్ని 57 ఏళ్లకు తగ్గిస్తామని గత ఎన్నికల్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత నెలలో దాన్ని అమలులోకి తెచ్చింది. కొత్త దరఖాస్తుదారులు పింఛను వస్తే కాస్త వెసులుబాటు ఉంటుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. కొత్త పింఛన్లతో ఖజానాపై నెలకు రూ.150 కోట్ల భారం పడనుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని