రైతుల సంక్షేమానికి రూ.లక్ష కోట్లు: హరీశ్‌

ప్రధానాంశాలు

రైతుల సంక్షేమానికి రూ.లక్ష కోట్లు: హరీశ్‌

హుజూరాబాద్‌, న్యూస్‌టుడే: ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయకు వెచ్చించిన నిధులతో సంబంధం లేకుండా రైతుల సంక్షేమానికి నేరుగా రూ.లక్ష కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చెప్పారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో సోమవారం నిర్వహించిన రైతులు, విత్తనోత్పత్తిదారుల ఆత్మీయ సమ్మేళన సభలో ఆయన మాట్లాడారు. ఉచిత కరెంటుకు ఇప్పటివరకు రూ.40 వేల కోట్లు, మూడేళ్లుగా రైతుబంధుకు రూ.43,036 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. రైతుబీమా కోసం వందల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. రూ.25 వేల రుణమాఫీకి తొలివిడతగా రూ.17 వేల కోట్లు ఖర్చు చేయగా, ఇపుడు రూ.50 వేల లోపు రుణమాఫీకి రూ.23 వేల కోట్లు ఇస్తోందన్నారు. వారం రోజుల్లోనే రూ.50 వేల లోపు రుణాలు మాఫీ చేస్తామని, ఆ తర్వాత రైతులు కొత్త రుణాలు తీసుకోవచ్చని వివరించారు. వచ్చే బడ్జెట్‌లో రూ.లక్ష రుణమాఫీకి నిధులు కేటాయిస్తామని చెప్పారు. కరోనా వల్ల ప్రభుత్వానికి రూ.లక్ష కోట్ల నష్టం వాటిల్లి, రుణమాఫీ కొంత ఆలస్యమైందని తెలిపారు. 57 ఏళ్ల వయసున్న వారందరికీ త్వరలోనే రూ.2,016 చొప్పున పింఛను ఇస్తామని హరీశ్‌రావు వివరించారు. ఇప్పటికీ కేసీఆర్‌ వ్యవసాయం చేస్తున్నారని, రైతుల కష్టాలు తీరుస్తున్న తెరాస ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని