త్వరలో అన్ని ఫ్లైఓవర్ల నిర్మాణాలు పూర్తి: కేటీఆర్‌

ప్రధానాంశాలు

త్వరలో అన్ని ఫ్లైఓవర్ల నిర్మాణాలు పూర్తి: కేటీఆర్‌

ఈనాడు- హైదరాబాద్‌: హైదరాబాద్‌ పరిధిలో రహదారులు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి పెద్దపీట వేశామని, వేర్వేరు దశల్లో ఉన్న పనులను త్వరలో పూర్తిచేస్తామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మహానగరంలో ఫ్లైఓవర్ల నిర్మాణం వల్ల వాహనాల త్వరగా వెళ్తున్నాయని, ఆ తాకిడి ప్రభావం శివారు ప్రాంతాలపై పడుతోందని, ఇక నుంచి ఇక్కడి రహదారుల అభివృద్ధిపైనా దృష్టికేంద్రీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి మాట్లాడారు. లాక్‌డౌన్‌ సమయంలో హెచ్‌ఎండీఏ సిబ్బంది అహర్నిశలు శ్రమించి కొత్త రోడ్లను అందుబాటులోకి తెచ్చారని కేటీఆర్‌ కొనియాడారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. మురుగునీటి శుద్ధి కేంద్రాలను కూడా పెద్దఎత్తున నెలకొల్పామని, వచ్చే రెండు దశాబ్దాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ప్రణాళికలను రూపొందించామన్నారు. రూ.1,946.9 కోట్లతో ఇప్పటి వరకూ 22 పనులు పూర్తిచేశామని, ఎస్‌ఆర్‌డీపీ కింద రూ.5,693.51 కోట్లతో 24 పనులను త్వరలో పూర్తిచేస్తామన్నారు. ఈ నిధులను ఎస్‌బీఐ నుంచి రుణంగా తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జనపనార మిల్లుల ఏర్పాటుపై అడిగిన మరో ప్రశ్నకు కేటీఆర్‌ సమాధానమిస్తూ...గోనె సంచులను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసేందుకు వీలుగా మూడు జనపనార సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. వరంగల్‌ జిల్లాలో మెస్సర్స్‌ గ్లోస్టర్‌ లిమిటెడ్‌, రాజన్న సిరిసిల్లలో మెస్సర్స్‌ ఎంబీజీ కమోడిటీస్‌, కామారెడ్డిలో మెస్సర్స్‌ కాళేశ్వరం ఆగ్రో ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థలు జనపనార మిల్లులు ఏర్పాటుచేస్తాయన్నారు. రాష్ట్రంలో జనుమును మూడోపంటగా వేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని