ఏకగ్రీవాలకు నిధులపై సీఎందే నిర్ణయం

ప్రధానాంశాలు

ఏకగ్రీవాలకు నిధులపై సీఎందే నిర్ణయం

రూ.15లక్షలు ఇస్తామని ఉత్తర్వులు, హామీ ఇవ్వలేదు
శాసనమండలిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏకగ్రీవ పంచాయతీలకు నిధుల విషయమై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఏకగ్రీవమైన పంచాయతీలకు రూ.15 లక్షల చొప్పున ఇస్తామని ప్రభుత్వం ఉత్తర్వులివ్వలేదన్నారు. హామీ కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. మండల, జిల్లా పరిషత్‌లకు రూ.500 కోట్ల గ్రాంటు నిధులపై నిబంధనలు జారీ చేస్తామన్నారు. పంచాయతీల వద్ద తగినన్ని నిధులున్నాయని, ఎక్కడైనా అవసరమైతే వైకుంఠ ధామాలు, ఇతర పనుల బిల్లులు చెల్లించేందుకు ఇప్పటికే వినియోగహక్కులిచ్చామని, నిధుల విడుదల నిరంతరాయంగా కొనసాగుతోందన్నారు. స్థానిక సంస్థలకు తలసరి గ్రాంటు నిధులపై శాసనమండలిలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. పంచాయతీలకు ఏకగ్రీవ నిధులు ఇవ్వలేదని, కొత్తగా పంచాయతీలుగా మారిన తండాల్లో సాధారణ గ్రాంటు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కోరారు. నిధుల కొరత, గ్రాంట్లు లేకపోవడంతో మండల, జిల్లా పరిషత్‌ల నిర్వహణ కష్టంగా మారిందని, మూడేళ్లుగా సెస్‌ నిధులు రావడం లేదని ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి ప్రతిపాదనలు పంచాయతీరాజ్‌శాఖకు పంపించి చాలా రోజులైందని, నిధులు విడుదల చేసి వెసులుబాటు కల్పించాలని ఎమ్మెల్సీలు కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని