భాష, సంస్కృతి పరిరక్షణకుప్రత్యేక ఎజెండా కావాలి: ఉపరాష్ట్రపతి

ప్రధానాంశాలు

భాష, సంస్కృతి పరిరక్షణకుప్రత్యేక ఎజెండా కావాలి: ఉపరాష్ట్రపతి

నారాయణగూడ, న్యూస్‌టుడే: భాష, సంస్కృతి పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక ఎజెండాతో ముందుకు రావాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. నెల్లూరులోని వి.ఆర్‌.కళాశాలలో ఆయనకు తెలుగు బోధించిన గురువు బ్రహ్మశ్రీ పోలూరి హనుమజ్జానకీరామశర్మ పేరిట తెలంగాణ సారస్వత పరిషత్తు ద్వారా నెలకొల్పిన తొలి సాహితీ పురస్కారాన్ని సుప్రసిద్ధ సాహితీవేత్త కోవెల సుప్రసన్నాచార్యకు అందజేశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ పరిషత్తు ప్రాంగణంలో నిర్వహించిన పురస్కార ప్రదాన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. ‘‘చదువు చెప్పిన గురువులను స్మరించుకుంటే మంచి ఆలోచనలకు బీజం పడుతుంది. మాతృభాషకు ప్రాధాన్యమిస్తున్న నూతన విద్యావిధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మాతృభాషలోనే అందించాలి. నేటికీ మాతృభాష గురించి చెప్పడం.. ఉద్యమించడం దురదృష్టకరం’’ అన్నారు. పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి తెలుగు భాష గొప్పదనాన్ని వివరించారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య రచించిన ‘డా.దేవులపల్లి రామానుజరావు’ గ్రంథాన్ని, 75 మంది కవుల రచనలతో కిన్నెర సంస్థ ప్రచురించిన ‘అమృతోత్సవ భారతి’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని