నాణ్యతకు ప్రాధాన్యమిస్తేనే లాభసాటిగా వ్యవసాయం

ప్రధానాంశాలు

నాణ్యతకు ప్రాధాన్యమిస్తేనే లాభసాటిగా వ్యవసాయం

నారం డైరెక్టర్‌ శ్రీనివాసరావు

ఈనాడు, హైదరాబాద్‌: ఆహార ఉత్పత్తుల నాణ్యతకు ప్రాధాన్యమిస్తేనే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని వ్యవసాయ పరిశోధన, నిర్వహణ జాతీయ అకాడమీ (నారం) డైరెక్టర్‌ సి.హెచ్‌.శ్రీనివాసరావు అన్నారు. ఆరోగ్యం, ఎగుమతులు కాపాడుకోవడానికి ఆహార పదార్థాలు, చేపలు, మాంసం, పాలు తదితరాలు కలుషితం కాకుండా చూసుకోవాలని సూచించారు. ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) నిర్వహించిన సదస్సులో శ్రీనివాసరావు మాట్లాడారు. ‘‘కరోనా కారణంగా ఆహారం విషయంలో ప్రజల్లో అప్రమత్తత పెరిగింది. చిన్న కమతాల్లో పంటలు సాగు చేసే చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, యాజమాన్య విధానాలు అమలుపరిచే అంశంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాంటి వారి రాబడి మెరుగుకు రైతు ఉత్పత్తి సంస్థ(ఎఫ్‌పీవో)లు కీలకం. ఇవి దేశవ్యాప్తంగా భారీగా పెరగాలి’’ అని పేర్కొన్నారు. సదస్సులో బీఐఎస్‌ హైదరాబాద్‌ డైరెక్టర్‌ కె.వి.రావు, జాతీయ సిమెంట్, నిర్మాణ సామగ్రి కేంద్రం బాధ్యులు కె.వి.కల్యాణి, జీఎస్‌ఐ శిక్షణ సంస్థ సీనియర్‌ శాస్త్రవేత్త పీవీవీఆర్‌ శర్మ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌(ఐఐపీ) డిప్యూటీ డైరెక్టర్‌(డీడీ) ఎన్‌.నటరాజ్‌ పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని