45 కి.మీ. వరకు డ్రోన్‌తో ఔషధాలు, సరకుల రవాణా

ప్రధానాంశాలు

45 కి.మీ. వరకు డ్రోన్‌తో ఔషధాలు, సరకుల రవాణా

ఈనాడు, హైదరాబాద్‌: నదీతీర, మారుమూల అటవీ ప్రాంతాలకు అత్యవసర ఔషధాలు, టీకాల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన డ్రోన్ల పరిధి రోజురోజుకూ పెరుగుతోంది. తొలుత ప్రయోగాత్మకంగా వికారాబాద్‌ జిల్లాలో 500 మీటర్ల దూరం వరకు ఔషధాలు పంపిణీ అయ్యాయి. అనంతరం 2, 5 కిలోమీటర్లకు, అటు తర్వాత 20,25,33 కి.మీటర్లకు సేవలను విస్తరించారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ టీవర్క్స్‌ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో తాజాగా 33 నిమిషాల్లో 45 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఎయిర్‌బోర్న్‌ మెడికల్‌ ట్రాన్స్‌పోర్టు (ఏఎంఆర్‌టీ25) హైబ్రిడ్‌ డ్రోన్‌ను అభివృద్ధి చేసింది. గురువారం దీని ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం నుంచి దీని సేవలు ప్రారంభిస్తామని టీవర్క్స్‌ వర్గాలు వెల్లడించాయి.

‘ఈ నెలాఖరు నాటికి వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా దీన్ని అభివృద్ధి చేస్తాం. 3.5 కిలోల బరువు గల వస్తువులను మోసే సామర్థ్యం దీనికి ఉంటుంది’ అని టీవర్క్స్‌ సీఈవో సుజయ్‌ కారంపూరి తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డ్రోన్లలోని బ్యాటరీని 20-25 కిలోమీటర్ల తర్వాత రీఛార్జి చేయడమో లేదా మార్చడమో చేయాల్సి ఉంటుందని, తాము రూపొందించిన డ్రోన్లు వంద కిలోమీటర్ల వరకు నిరాటంకంగా ప్రయాణిస్తాయని వెల్లడించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని