రైతుల ఉద్యమం అణచివేతకు కేంద్రం కుట్ర

ప్రధానాంశాలు

రైతుల ఉద్యమం అణచివేతకు కేంద్రం కుట్ర

ఏఐకేఎస్‌ జాతీయ నేత విజ్జూ కృష్ణన్‌ ధ్వజం

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం చేస్తున్న కుట్రను తిప్పి కొడతామని ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ(ఏఐకేఎస్‌) జాతీయ సహాయ కార్యదర్శి డాక్టర్‌ విజ్జూ కృష్ణన్‌ హెచ్చరించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.జంగారెడ్డి అధ్యక్షతన ఆదివారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా సర్కారు విభజన రాజకీయాలకు పాల్పడుతూ, సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, అస్సాం రాష్ట్రాల్లో హింసను ప్రేరేపిస్తూ పోలీసులు, ఆర్‌ఎస్‌ఎస్‌ను పురిగొల్పిందని ఆరోపించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ మాట్లాడుతూ కేరళ ప్రభుత్వం 19 రకాల పండ్లు, కూరగాయలకు ధరలు నిర్ణయించి రైతులను ప్రోత్సహించిందన్నారు. తెరాస సర్కారూ అలా రైతులకు భరోసా కల్పించాలని కోరారు. ప్రత్యామ్నాయ పంటలకు తాము వ్యతిరేకం కాదన్నారు. ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షుడు ఎస్‌.మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ, రుణ ప్రణాళిక లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర, జిల్లాల నేతలు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని