ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులపై వివరణ ఇవ్వండి

ప్రధానాంశాలు

ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులపై వివరణ ఇవ్వండి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఫీజులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఫీజుల నియంత్రణకు నిర్దిష్ట యంత్రాంగం లేని కారణంగా పాఠశాలలు ఇష్టానుసారం రుసుంలు వసూలు చేయడంపై వివరణ ఇవ్వాలంటూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, డైరెక్టర్‌, కేంద్ర విద్యాశాఖ, సీబీఎస్‌ఈ, తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్‌, స్వతంత్ర పాఠశాలల మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌లకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నవంబరు 17వ తేదీకి వాయిదా వేసింది.ఫీజుల నియంత్రణకు ఎలాంటి అధీకృత సంస్థ/వ్యవస్థ లేకపోవడంతో ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలు ఇష్టానుసారం డబ్బు వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ తరఫున సంయుక్త కార్యదర్శి కె.వి.సాయినాథ్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది యాకారపు శీలు వాదనలు వినిపించారు. నియంత్రణ యంత్రాంగం లేకపోవడంతో పాఠశాలలు ట్యూషన్‌ ఫీజుతోపాటు, ఇతర రుసుంలను ఇష్టప్రకారం నిర్ణయిస్తున్నాయని, ఇది చట్ట విరుద్ధమని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. నియంత్రణకు యంత్రాంగాన్ని రూపొందించి విద్యా వ్యాపారాన్ని అడ్డుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఫీజులపై ప్రభుత్వం ఇచ్చిన జీవో 75కు సవరణ చేయడంతోపాటు వసూలుచేసే సొమ్ములో 40% కొవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌ ఏర్పాటు చేసేలా, తిరుపతిరావు కమిటీ నివేదికను బహిరంగపరచేలా ఆదేశించాలని విన్నవించారు. వాదనలనువిన్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని