మన వాళ్ల సాయంతో బయటపడ్డాం

ప్రధానాంశాలు

మన వాళ్ల సాయంతో బయటపడ్డాం

ఉత్తరాఖండ్‌ వరదల నుంచి బయటపడిన సుష్మ వెల్లడి

మల్కాజిగిరి, న్యూస్‌టుడే: ఉత్తరాఖండ్‌ పర్యటనలో హఠాత్తుగా సంభవించిన వరదలతో ప్రాణాల మీద ఆశ వదులుకున్న పరిస్థితుల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సీఎం కార్యాలయం స్పదించడంతో క్షేమంగా బయటపడ్డామని సుష్మ వెల్లడించారు. స్నేహితురాళ్లు హోలి, కృతి, శ్రుతి, శుశితో కలిసి ఉత్తరాఖండ్‌ వెళ్లి తిరిగి హైదరాబాద్‌ చేరుకున్న ఆమె బుధవారం తన నివాసంలో అక్కడి అనుభవాలను వివరించారు. ‘‘ఈ నెల 14న హైదరాబాద్‌ నుంచి బయలుదేరి అక్కడకు చేరుకున్నాక...మూడు రోజులపాటు వివిధ పర్యాటక ప్రాంతాలను తనివితీరా తిలకించాం. సోమవారం అక్కడి వాతావరణం మారిపోయింది. భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. మేము ఉన్న రాంనగర్‌ ప్రాంతంలోని భవనం రెండంతస్తుల వరకూ వరదనీరు వచ్చి చేరింది. ప్రాణాలపై ఆశలు వదులుకున్నాం. మంగళవారం ఉదయం అక్కడి భీతావహ పరిస్థితులపై మల్కాజిగిరి ఆర్కేనగర్‌లోని తల్లిదండ్రులకు  సమాచారం ఇచ్చాం. వారు స్థానిక నేతల ద్వారా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి, సీఎం కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. మాకు సాయం అందించేందుకు విపత్తుల నివారణ బృంద సభ్యులు మా వద్దకు వచ్చారు. రోడ్డు మార్గంలో మంగళవారం రాత్రి పది గంటల తర్వాత దిల్లీకి చేర్చారు. బుధవారం తెల్లవారుజామున దిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9 గంటల కల్లా ఇంటికి చేరుకున్నా’’ అని ఆమె వివరించారు. ‘‘నా స్నేహితురాళ్లు చండీగఢ్‌, దిల్లీ, జైపూర్‌, రాంచీ ప్రాంతాలకు చెందిన వారు. కేవలం మన ప్రజాప్రతినిధుల జోక్యంతోనే మేము క్షేమంగా అక్కడ నుంచి దిల్లీకి చేరుకున్నాం. మాకు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తదితరులు అండగా నిలిచారు’’ అని తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని