గందరగోళంలో పొరపాటు జరిగింది

ప్రధానాంశాలు

గందరగోళంలో పొరపాటు జరిగింది

త్రిసభ్య కమిషన్‌ విచారణలో డీసీపీ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై జస్టిస్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్‌ బుధవారం శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిని విచారించింది. ఎన్‌కౌంటర్‌ అనంతరం మీరు ఇచ్చిన వివరాల ఆధారంగానే సైబరాబాద్‌ అప్పటి కమిషనర్‌ సజ్జనార్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు కదా.. అని కమిషన్‌ తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. దీనికి ప్రకాశ్‌రెడ్డి అవునని సమాధానమిచ్చారు. ‘దిశ’ హత్యాచారం వివరాలు ప్రధాన నిందితుడు ఆరిఫ్‌ వాంగ్మూలం ఆధారంగానే తెలిసినప్పుడు మరో నిందితుడు జొల్లు నవీన్‌ ఆమె వాహనం టైరు గాలి తీశాడని విలేకరుల సమావేశంలో ఎలా చెప్పారని అడిగారు. కొన్ని విషయాలను తానిచ్చిన సమాచారానికి భిన్నంగా కమిషనర్‌ వెల్లడించారని బదులిచ్చారు. నిందితులంతా కలిసి కుట్ర పన్నారని తాను చెబితే.. కమిషనర్‌ మరో విధంగా చెప్పారని పేర్కొన్నారు. ‘దిశ’ సంబంధిత వస్తువుల స్వాధీనం, డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ అంశాల వివరాలనూ మరోలా వెల్లడించారని బదులిచ్చారు. ఆ సమయంలో మీరెందుకు అడ్డు చెప్పలేదని ప్రశ్నిస్తే.. గందరగోళం (కన్ఫ్యూజన్‌) వల్ల పొరపాటు జరిగిందన్నారు. ఆ గందరగోళం వల్లే తాను ఆపలేకపోయానన్నారు. ఎన్‌కౌంటర్‌ ఘటనాస్థలికి సమీపంలోనే విలేకరుల సమావేశం నిర్వహించడం వల్ల దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని అనిపించలేదా.. అని అడిగితే అనిపించలేదు అన్నారు. ఘటనపై అంత అత్యవసరంగా విలేకరుల సమావేశం ఎందుకు నిర్వహించారన్న ప్రశ్నకు.. 100 మంది వరకు మీడియా ప్రతినిధులు ఒత్తిడి చేయడంతోనే అని సమాధానమిచ్చారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని