ఆర్బీఐ సర్క్యులర్‌పై సత్వర విచారణ

ప్రధానాంశాలు

ఆర్బీఐ సర్క్యులర్‌పై సత్వర విచారణ

తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల విషయంలో విచారణకు సుప్రీంకోర్టు సమ్మతి

ఈనాడు, దిల్లీ: బ్యాంకు ఖాతాలను మోసపూరిత ఖాతాలుగా ప్రకటించేందుకు మార్గదర్శకాలిస్తూ భారతీయ రిజర్వ్‌ బ్యాంకు(ఆర్‌బీఐ) జారీచేసిన మాస్టర్‌ సర్క్యులర్‌ అమలు సమయంలో సహజ న్యాయసూత్రాలను దృష్టిలో ఉంచుకోవాలన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌చేస్తూ ఆర్‌బీఐ, ఎస్‌బీఐ దాఖలుచేసిన పిటిషన్లపై త్వరలో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు సంకేతమిచ్చింది. శుక్రవారం ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమాకోహ్లి ధర్మాసనం ముందుకు వచ్చినప్పుడు త్వరగా విచారణకు స్వీకరించాలని ఎస్‌బీఐ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా విజ్ఞప్తి చేశారు. ఆర్‌బీఐ సర్క్యులర్‌ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌చేస్తూ దాఖలైన ఎస్‌ఎల్‌పీ సుప్రీంకోర్టు ముందు పెండింగ్‌లో ఉందన్నారు. మరోవైపు దేశంలోని మిగతా హైకోర్టుల ముందుకూ ఇలాంటి కేసులు వస్తున్నందున ఈ కేసును అత్యవసరంగా విచారించాలని కోరారు. ధర్మాసనం సర్క్యులర్‌ నేపథ్యం గురించి అడగ్గా ఆయన వివరించారు. ‘‘ఆర్‌బీఐ మాస్టర్‌ సర్క్యులర్‌ను అనుసరించి ఏ ఖాతానైనా మోసపూరితమైందిగా ప్రకటించేముందు తప్పనిసరిగా సదరు ఖాతాదారుడి వాదనలు వినాలని, ఏకపక్షంగా అలా ప్రకటించడానికి వీల్లేదని’’ గతంలో తెలంగాణ హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చినట్లు సొలిసిటర్‌ జనరల్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని