ఎస్‌.ఆర్‌. శంకరన్‌ మార్గం అనుసరణీయం

ప్రధానాంశాలు

ఎస్‌.ఆర్‌. శంకరన్‌ మార్గం అనుసరణీయం

ఈనాడు, హైదరాబాద్‌: అట్టడుగు వర్గాల హక్కులు, సంక్షేమం, న్యాయం కోసం దివంగత ఐఏఎస్‌ ఎస్‌.ఆర్‌.శంకరన్‌ తపించేవారని, ఆయన చూపిన మార్గంలో అధికారులందరూ పయనించాలని కేంద్ర సామాజిక న్యాయశాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రమణ్యం పిలుపునిచ్చారు. ముస్సోరిలోని ఐఏఎస్‌ శిక్షణ అకాడమీలో అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం ‘సెంటర్‌ ఫర్‌ ఇన్‌క్లూజన్‌’ ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. సామాజిక ప్రజాస్వామ్య వేదిక(ఎస్‌డీఎఫ్‌) ఛైర్మన్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఎ.మురళి ఆధ్వర్యంలో ఎస్‌.ఆర్‌.శంకరన్‌ జయంతి సందర్భంగా ఆదివారం ‘పీపుల్స్‌ ఐఏఎస్‌’ పేరిట ఆన్‌లైన్లో సదస్సు నిర్వహించారు. ‘‘కేంద్రం ఏటా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేస్తున్న రూ.1.27 లక్షల కోట్లు ఎక్కడికెళ్తున్నాయో తెలియడం లేదు. ఐఏఎస్‌లు నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలి’’ అని రెడ్డి సుబ్రమణ్యం పేర్కొన్నారు. విశ్రాంత ఐఏఎస్‌ కొప్పుల రాజు మాట్లాడుతూ.. ‘‘ఉన్నతాధికారి అనుమతి తీసుకుని ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సరైనది కాదు’’ అన్నారు. ‘‘సీఎంలు మారిన వెంటనే గత సీఎం దగ్గరగా పనిచేసిన అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా తాత్సారం చేయడం మంచిది కాదు’’ అని మాజీ సీఎస్‌ కాకి మాధవరావు పేర్కొన్నారు. ‘‘ఏపీ, తెలంగాణల్లో అధికారులు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. కలెక్టర్లకు, ఐటీడీఏ పీవోలకు స్వేచ్ఛ లేకుండా పోయింది’’ అని విశ్రాంత అధికారి గోపాల్‌రావు పేర్కొన్నారు. కేరళ మాజీ సీఎస్‌ విజయానంద్‌, ఎంవీ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు శాంతా సిన్హా మాట్లాడారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని