సేవలు నమ్మకం పెంచేలా ఉండాలి

ప్రధానాంశాలు

సేవలు నమ్మకం పెంచేలా ఉండాలి

 అప్పుడే ఎక్కువ మందికి ఉచిత న్యాయ సహాయం

న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌

ఈనాడు, సంగారెడ్డి: ఉచిత న్యాయ సహాయాన్ని వీలైనంత ఎక్కువ మంది ఉపయోగించుకోవాలంటే వారిలో అవగాహన పెరగాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ అన్నారు. అంతేకాకుండా సంస్థ ద్వారా అందే సేవలు పూర్తిగా నాణ్యంగా, బాధితుల్లో నమ్మకం పెంచేలా ఉండాలన్నారు. ప్రస్తుతం ఉచిత న్యాయ సహాయాన్ని కేవలం ఒక్క శాతం మంది మాత్రమే వినియోగించుకుంటున్నారని, మిగతా 99 శాతం మందికి ఎందుకు అందడం లేదనే అంశమై దృష్టిసారించాలన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం శివారులో ఆదివారం నిర్వహించిన ‘న్యాయ విజ్ఞాన సదస్సు’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ తెలుగులో ప్రచురించిన పుస్తకాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ షమిమ్‌ అక్తర్‌, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డి, జస్టిస్‌ జి.శ్రీదేవి తదితరులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ‘సత్వర న్యాయం’ పేరిట రూపొందించిన పాటను విడుదల చేశారు. ఆస్తి పంపకాలకు సంబంధించి న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించిన పద్మమ్మ, ఆమె కుటుంబ సభ్యులకు రూ.కోటి విలువైన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ మాట్లాడుతూ... పాన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా న్యాయపరమైన అవగాహనపై అక్టోబరు 2 నుంచి నవంబరు 14 వరకు చేపట్టే కార్యక్రమాలు ప్రతి గ్రామాన్నీ చేరేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా 12 మంది వికలాంగులకు మూడు చక్రాల వాహనాలను అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి వై.రేణుక, ఉమ్మడి మెదక్‌ జిల్లా కోర్టు న్యాయమూర్తి పాపిరెడ్డి, హైకోర్టు అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు, ఎస్పీ రమణకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని