ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ప్రధానాంశాలు

ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ఆర్వోఆర్‌ చట్టంపై దామోదర రాజనర్సింహా పిటిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: సవరణలకు అవకాశం లేకుండా ప్రభుత్వం తీసుకువచ్చిన తెలంగాణ భూమి యాజమాన్య హక్కులు, పట్టాదార్‌ పాస్‌బుక్‌ చట్టం (ఆర్వోఆర్‌- రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌)లోని నిబంధనలపై ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ చట్టంలోని సెక్షన్‌ 3, 5, 6, 7, 8, 10లకు సంబంధించి పూర్తివివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జనవరి 19వ తేదీకి వాయిదా వేసింది. కొత్త ఆర్వోఆర్‌ చట్టంలోని సెక్షన్‌లతోపాటు ధరణిలో సవరణలకు సీసీఎల్‌ఏ జనవరి 15న తీసుకువచ్చిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ కాంగ్రెస్‌ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎల్‌.వాణి వాదనలు వినిపించారు. ‘‘గతంలో ఉన్న చట్టం ప్రకారం విక్రయ, కానుక, తనఖా రిజిస్ట్రేషన్లను రద్దు చేసుకోవడానికి అవకాశం ఉండేది. కొత్త చట్టంలో అలాంటి నిబంధన లేదు. రికార్డుల్లో సవరణకు సివిల్‌ కోర్టులను ఆశ్రయించాల్సి ఉంది. అధికారులు తయారు చేసిన రికార్డుల్లోని తప్పులకు భూమి యజమానులు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ధరణిలో సవరణలకు సీసీఎల్‌ఏ సర్క్యులర్‌ ఆధారంగా కలెక్టర్‌ సవరణ చేస్తారు. అయితే సవరణ చేయడానికి కలెక్టర్‌కు కొత్త చట్టం అధికారం ఇవ్వలేదు. కొత్త చట్టం ద్వారా ప్రజల సమస్యలపై అధ్యయనానికి ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు ఆదేశించాలి’’ అని కోరారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది భాస్కర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని