తెలంగాణలో ‘లైట్‌హౌస్‌’ పైలట్‌ ప్రాజెక్టు

ప్రధానాంశాలు

తెలంగాణలో ‘లైట్‌హౌస్‌’ పైలట్‌ ప్రాజెక్టు

సీఐఐ- దక్షిణ ప్రాంత ఛైర్మన్‌ సి.కె.రంగనాథన్‌

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణాది రాష్ట్రాల్లో భవిష్యత్తు వ్యాపారవేత్తలను తయారుచేసే లక్ష్యంతో ‘లైట్‌ హౌస్‌’ ప్రాజెక్టును సీఐఐ ఆవిష్కరించనుందని సీఐఐ (భారతీయ పరిశ్రమల సమాఖ్య) దక్షిణ ప్రాంత ఛైర్మన్‌ సి.కె.రంగనాథన్‌ తెలిపారు. దీనికి సంబంధించిన పైలట్‌ ప్రాజెక్టును తెలంగాణలో చేపడతామని బుధవారం వెల్లడించారు. ఈ కేంద్రం ద్వారా తెలంగాణలో పారిశ్రామికవేత్తలను తయారు చేసే కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. హైదరాబాద్‌లోని టి-హబ్‌లో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, స్టార్టప్స్‌’ ను సీఐఐ నెలకొల్పిందని పేర్కొన్నారు.

పెట్టుబడులపై ప్రభుత్వంతో కలిసి కృషి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన టెక్స్‌టైల్‌ పార్కు, ఎలక్ట్రానిక్స్‌ పార్కు, ఫార్మా సిటీ ప్రాజెక్టులకు పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు రంగనాథన్‌ వెల్లడించారు. సీఐఐ- గవర్నమెంట్‌ కన్సల్టేటివ్‌ ఫోరమ్స్‌ ద్వారా ఈ ప్రాజెక్టుల ప్రత్యేకతలను పెట్టుబడిదార్లకు వివరిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్‌-ఐపాస్‌ దేశంలో అత్యుత్తమ కార్యక్రమమని ఆయన వివరించారు. రెండో అంచె నగరాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడం ద్వారా పట్టణ- గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరాలను తగ్గించవచ్చని, ఇందుకోసం వరంగల్‌, నిజామాబాద్‌ నగరాల్లో పారిశ్రామికాభివృద్ధికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.  రక్షణ, విమాన పరిశ్రమల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం, పరిశ్రమల ప్రతినిధులతో ఒక బృందాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని సూచించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని