జైలు సూపరింటెండెంట్‌ పోస్టుకు మహిళలూ అర్హులే

ప్రధానాంశాలు

జైలు సూపరింటెండెంట్‌ పోస్టుకు మహిళలూ అర్హులే

నియంత్రించే నిబంధనను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు

ఈనాడు, హైదరాబాద్‌: జైళ్ల శాఖలో మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్‌లు.. సూపరింటెండెంట్‌ పదోన్నతికి అర్హులేనని హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. కేవలం పురుషులకు మాత్రమే వర్తించేలా ఉన్న జీవోలోని నిబంధనను కొట్టివేసింది. పదోన్నతి కల్పించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ వరంగల్‌ మహిళా జైలులో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న టి.వెంకటలక్ష్మి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది జి.విద్యాసాగర్‌ వాదనలు వినిపిస్తూ.. 1996లో జారీ చేసిన జీవో 316 ప్రకారం రూపొందించిన నిబంధనలు వివక్షపూరితంగా ఉన్నాయన్నారు. అందులోని కేటగిరీ 3లోని 4(ఎ) నిబంధన ప్రకారం డిప్యూటీ సూపరింటెండెంట్‌గా ఉన్నవారికే సూపరింటెండెంట్‌ పోస్టుకు అర్హత ఉందన్నారు. ఇదే కేటగిరీలో 4(బి)కింద డిప్యూటీ సూపరింటెండెంట్‌(మహిళ)కు అర్హత కల్పించలేదని చెప్పారు. విధులన్నీ ఒకేరకంగా ఉన్నప్పటికీ వివక్ష చూపుతున్నారన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ఆ నిబంధనను కొట్టివేస్తూ మహిళలకూ సూపరింటెండెంట్‌ పదోన్నతి కల్పించాలని ఆదేశించింది. సైన్యంలో పురుషులకు సమానంగా మహిళలకూ అవకాశం కల్పిస్తుండగా.. జైళ్లశాఖలో అవకాశం ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది. పిటిషనర్‌కు పదోన్నతి కల్పించాలని, వేతన బకాయిలనూ చెల్లించాలని ఆదేశించింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని