close

ప్రధానాంశాలు

కొత్త ప్రగతి దారుల్లోకి...

ఏప్రిల్‌ 7వ తేదీ ఉదయం 9 నుంచి, 8 ఉదయం 9 గంటల వరకూ 851 కవితలు వచ్చాయి. పోటీ ఫలితాలివీ...


రూ.1000 ప్రథమ బహుమతి కవిత

ఒక విపత్తు ఎత్తి కుదేసి విసిరేస్తే
ఇళ్లలో కూలబడ్డ కోట్లాది దేహాలు
పనులు గోళ్లు గిల్లుకుంటున్న వేళ
పరపతి కరవై బజారున పడ్డ ఇళ్లు
ఎటు చూసినా ఖాళీ కంచాల్లా దర్శనమిస్తున్న కూడళ్లు
గుండె దారపుండలో పడ్డ చిక్కు ఎంతకూ విడివడదు
రోజు ఎలా గడుస్తుందోనన్న దిగులుతో
ముద్ద ఎవరికీ మింగుడు పడదు
ఓ సూక్ష్మజీవి భూగోళాన్ని పుక్కిట పట్టాలని ప్రయత్నిస్తోంది
ప్రపంచమిప్పుడు రెక్కలు విరిగిన విమానమైపోయింది
గుట్టలు గుట్టలుగా వచ్చిపడ్డ వస్తువుల్లాంటి
వ్యక్తులతో నిన్నటిదాకా కిటకిటలాడిన నగరం...
వెన్నెలను వెక్కిరిస్తూ
మిలమిల కాంతులతో మిడిసిపడ్డ నగరం...
ఒక్కసారిగా ఒళ్లుపేల్చే
జ్వరమొచ్చిన దానిలా వణికిపోతోంది
ఇంపూతెంపూ లేకుండా పెరిగిపోతున్న
రోగుల సంఖ్యతో హడలి చస్తోంది
ఉరుకులూ, పరుగుల మధ్య మనం ఉమ్మేసిన కాలుష్యమో...
ఆకాశహర్మ్యాలకు ఎగబాకిపోవాలన్న అత్యాశతో
మనిషితనాన్ని తొక్కుకుంటూ దూసుకెళ్లిన నిర్లక్ష్యమో...
పచ్చని చెట్లను కాదని పొగ గొట్టాలను పాతుకుంటూ
పర్యావరణాన్ని పలుచన చేసిన పర్యవసానమో ...
ఇంతటి ఈ వైపరీత్యానికి కారణమేమంటే
ఏదని చెప్పగలం?
ఎన్ననుకున్నా మాత్రం ఇప్పుడేం లాభం?
మంచో చెడో మనమిపుడొక స్వీయ నిర్బంధపు
పైకప్పు కిందకు చేరుకున్నాం
ఎవరిళ్లలో వాళ్ల చిరునామాలను ఎంచక్కా చూసుకుంటున్నాం
ఈ నాలుగు రోజులయినా ఇల్లు కదలకుండా ఉంటూ
మనల్ని మనం నాలుగు ప్రేమవాక్యాలుగా మలచుకుందాం
పోటీ ప్రపంచాన పడి మరచిపోయిన మన జ్ఞాపకాలకు
మళ్లీ బాణీలు కట్టుకుని అనురాగ గీతాలను ఆలపిద్దాం
నిండా పోగుపడ్డ కృత్రిమత్వం వదిలేదాకా
మన మనసులను కడుక్కుని
సతత హరిత జీవులమై మళ్లీ చివురిద్దాం
మన జీవన ప్రయాణ పుటలను మరోసారి తిరగేద్దాం
పాదముద్రారాక్షసాలెక్కడున్నాయో మనసుపెట్టి వెతికి
మన నడకలను మనమే సరిచేసుకుందాం
ప్రకృతి వేలుపట్టి నడిచే
కొత్త ప్రగతి దారులకు బాటలు వేద్దాం
నేల చెక్కిలి మీది దుఃఖ చారికలను తుడిచి
విశ్వమానవ ప్రేమను ఆవిష్కరిద్దాం

- పక్కి రవీంద్రనాథ్‌, పార్వతీపురం


ద్వితీయ బహుమతి (రూ.750): యాంటీ వైరస్‌ కావాలి - చిలుకూరి శ్రీనివాసరావు, కడియం, తూర్పుగోదావరి జిల్లా
తృతీయ (రూ.500): జర భద్రం బిడ్డా... - దుడుగు నాగలత, సిద్దిపేట. ఇవి మూడూ ‘ఈనాడు ఎఫ్‌.ఎం.’లో ప్రసారమవుతాయి.
ప్రోత్సాహక బహుమతికి ఎంపికైన వారు - పేరాల బాలకృష్ణ, విల్సన్‌రావు కొమ్మవరపు, నితిన్‌ లకమళ్ల, హైదరాబాదు; పి.సుష్మ, మక్తల్‌; డా।। చందనవల్లి బసవ, నూజివీడు. ఈ కవితలన్నింటినీ teluguvelugu.in లో, టెలిగ్రాం యాప్‌లో తెలుగువెలుగు ఛానల్‌లో చూడవచ్చు. ఈ పోటీ నిర్వహణ భాగస్వాములు ఈనాడు, ఈటీవీ భారత్‌, ఈనాడు.నెట్‌, ఈ.ఎఫ్‌.ఎం.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.