close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పౌరసరఫరాల శాఖకు కందుల బాధ్యత

వచ్చే సీజను నుంచి కొనుగోళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే వానాకాలం సీజన్‌ నుంచి కందుల కొనుగోలు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖకు అప్పగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, నారాయణపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్‌ తదితర జిల్లాల్లో కంది పంట పండుతోంది. రాష్ట్రంలో ఏటా 7.22 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు. సాగునీరు సమృద్ధిగా ఉండటంతో పంటల మార్పిడి విధానాన్ని అమలు చేయనున్నారు. ఈసారి 12.51 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా పంటల దిగుబడులతో మేడిన్‌ తెలంగాణ బ్రాండ్‌ పేరిట బియ్యం, కందిపప్పు, పసుపు తదితర ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌లనూ ప్రోత్సహించనున్నారు. వీటి పరిధిలో బియ్యం, కందులు, నూనెల మిల్లులను ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలో కంది సాగు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్‌ ‘ఈనాడు’తో చెప్పారు.

కందులు కొనుగోలులోకి రాష్ట్రం
రాష్ట్రంలో రైతులు పండించిన కందులను జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(నాఫెడ్‌) ద్వారా కేంద్రం కొనుగోలు చేస్తోంది. గతంలో 25 శాతం దిగుబడిని కొనుగోలు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు 60 శాతం వరకు కొంటోంది. ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసే వ్యూహంతో కందులను కొనాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం తరహాలో కందులను కస్టమ్‌ మిల్లింగ్‌ తరహాలో పప్పు చేయించాలన్నది ఆలోచనగా ఉంది. రాష్ట్రం కొన్న కందులలోనే కేంద్రం ఎంత కోరితే అంత ఇచ్చి మిగిలిన నిల్వలను బహిరంగ మార్కెట్‌లో విక్రయించాలన్నది వ్యూహంగా ఉంది.


నియంత్రిత సాగుకు జై!
గజ్వేల్‌ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఏకగ్రీవ తీర్మానం

సిద్దిపేట, న్యూస్‌టుడే: వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా రైతాంగం నియంత్రిత పంటల సాగు విధానాన్ని అనుసరించాలంటూ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపునకు గజ్వేల్‌ నియోజకవర్గ  రైతుల నుంచి స్పందన లభిస్తోంది. ఈ నియోజకవర్గంలో 173 పంచాయతీలకు 149 పంచాయతీల పాలక వర్గాలు ఈ సాగు విధానానికి జై కొడుతూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు జిల్లా కలెక్టర్‌ వెంకటరామరెడ్డి సోమవారం వెల్లడించారు. గజ్వేల్‌ పరిధిలో 8 మండలాలుండగా గజ్వేల్‌, మర్కూక్‌, జగదేవపూర్‌, మనోహరాబాద్‌, తూప్రాన్‌ మండలాల పరిధి అన్ని గ్రామాల రైతులు తీర్మానాలు చేసినట్టు చెప్పారు. నూరు శాతం గ్రామాలు అనుకూలంగా తీర్మానాలు చేసిన మండలాల్లో మనోహరాబాద్‌, తూప్రాన్‌ మెదక్‌ జిల్లా పరిధి కాగా మిగిలినవి సిద్దిపేట జిల్లాకు చెందినవి. మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలోని 25 పంచాయతీల్లోనూ రైతులు ఈ దిశగా ఏకగ్రీవ తీర్మానాలు చేశారు.

పంటల సాగుకు మౌలిక వసతులు కల్పించాలి
ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం పంటలు పండించడానికి మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర రైతుసంఘం సీఎం కేసీఆర్‌కు విన్నవించింది. ‘ప్రతీ రైతు కమతంలోని మట్టి నమూనాలను పరీక్షించి భూసార పరీక్ష ఫలితాల కార్డును ఇవ్వాలి. దాని ఆధారంగా ఏ పంటలు సాగు చేయాలో సూచించాలి. నియంత్రిత పంటల సాగుకు విత్తనాలను జూన్‌ ఒకటిలోగా కర్షకులకు విక్రయించాలి. విత్తన చట్టాన్ని శాసనసభలో ఆమోదించాలి.’ అని సంఘం నేతలు సారంపల్లి మల్లారెడ్డి, టి.సాగర్‌ కోరారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.