close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వలస కార్మికుల సమస్యలో వాస్తవమెంత?

గమ్యం చేర్చే బాధ్యత ప్రభుత్వాలదే: హైకోర్టు
క్షేత్రస్థాయి పరిశీలనకు అడ్వొకేట్‌ కమిషనర్‌ నియామకం

ఈనాడు, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో మేడ్చల్‌ రహదారిపై ఒక్కరూ లేరని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా.. రోజుకు 500 మంది దాకా ఇక్కడికి వస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అంటుండటంతో వాస్తవమేంటో తెలుసుకోవడానికి శుక్రవారం హైకోర్టు అడ్వొకేట్‌ కమిషన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం వలస కార్మికులను క్షేమంగా గమ్యం చేర్చే బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. ఉచితంగా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అప్పటివరకు ఆశ్రయం, ఆహారం, మందులు వంటి కనీస అవసరాలను తీర్చాలంది. వలస కార్మికుల పరిస్థితులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టడానికి కౌటూరు పవన్‌కుమార్‌ను అడ్వొకేట్‌ కమిషనర్‌గా నియమించింది. ఆయనతో పాటు రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కూడా వెళ్లాలంది. కలెక్టర్‌ను కలిసి అమలు తీరును తెలుసుకోవాలని, ఆయన అధికార దర్పం ప్రదర్శిస్తే న్యాయస్థానానికి కళ్లు, చెవులు తామేనని చెప్పాలని కమిషన్‌కు సూచించింది. రెండు రోజులపాటు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, వలస కార్మికుల ఆవేదనను తెలుసుకోవాలని, భాషాపరమైన సమస్యలొస్తే వారి మాటలను రికార్డు చేయాలని చెప్పింది. సమగ్ర వివరాలతో జూన్‌ 1వ తేదీకి నివేదిక సమర్పించాలంటూ విచారణను 2వ తేదీకి వాయిదా వేసింది.

వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను రాష్ట్ర సరిహద్దుల్లో వదిలిపెడుతున్నారంటూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ రామ శంకరనారాయణ మెల్కొటే ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మేడ్చల్‌ రహదారిపై ఒక్క వలస కార్మికుడూ లేరని, వారిని తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం 200 రైళ్లను ఏర్పాటు చేసిందని చెప్పారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్‌ విభేదిస్తూ ఇప్పటికీ 500 నుంచి 600 మంది వలస కార్మికులు మేడ్చల్‌కు వస్తున్నారని అన్నారు. దీంతో వాస్తవాలు తెలుసుకోవడానికి ధర్మాసనం అడ్వొకేట్‌ కమిషనర్‌ను నియమించింది.

దివ్యాంగులకు రూ.10 కోట్లు కేటాయింపు
లాక్‌డౌన్‌లో దివ్యాంగుల అవసరాల కోసం రూ.10 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. దివ్యాంగులకు అవసరమైన వైద్య ఏర్పాట్లతో పాటు వారికి సేవలందించే ఎన్జీవోలకు పాస్‌లను జారీ చేయాలంటూ ఎస్‌.హెచ్‌.గణేశ్‌ కర్ణాటి వ్యాజ్యం దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు దివ్యాంగులకు చేసిన ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను జూన్‌ 9కి వాయిదా వేసింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.