close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రిమాండ్‌ ఖైదీలు ఇక సంగారెడ్డి జైలుకే!

 28 రోజులైనా బెయిల్‌ రాకపోతేనే  కేంద్ర కారాగారాలకు
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో  జైళ్లశాఖ సరికొత్త ప్రతిపాదన

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో చంచల్‌గూడ, చర్లపల్లి కేంద్ర కారాగారాలపై ఆ ప్రభావం పడకుండా ఉండేందుకు తెలంగాణ జైళ్ల శాఖ కీలక ప్రతిపాదన రూపొందించింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లతో పాటు వికారాబాద్‌ పోలీస్‌ యూనిట్‌ పరిధిలోని రిమాండ్‌ ఖైదీలను సంగారెడ్డి జిల్లా జైలుకు పంపాలనేది ఆ ప్రతిపాదన. ఈ జైలును ఖైదీల క్వారంటైన్‌ కేంద్రంగా మార్చాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. సాధారణంగా ఏదైనా కేసులో నిందితుల్ని న్యాయస్థానంలో హాజరుపరిస్తే తొలుత 14 రోజులపాటు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధిస్తారు. ఆ సమయంలో నిందితుల్ని జైలుకు తరలిస్తారు. మధ్యలో బెయిల్‌ లభిస్తే కారాగారం నుంచి వదిలేస్తారు. లేదంటే జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగిస్తారు. ఈ నేపథ్యంలో కనీసం 28 రోజులపాటు రిమాండ్‌ ఖైదీల్ని తొలుత సంగారెడ్డి జైలులోనే ఉంచాలనేది ప్రతిపాదన. ఆ లోపు బెయిల్‌ రాకపోతే కేసు నమోదైన ఠాణాను బట్టి ఆయా కారాగారాలకు తరలిస్తారు. ఈలోపు సాధారణ క్వారంటైన్‌ గడువు ముగుస్తుంది కాబట్టి చర్లపల్లి, చంచల్‌గూడ కేంద్ర కారాగారాలకు కరోనా భయం ఉండదనేది తాజా ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం హోంశాఖ వద్ద ఈ ఉన్న ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే వెంటనే కార్యాచరణ ప్రారంభిస్తామని జైళ్ల శాఖలోని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. పలు రాష్ట్రాల్లో జైళ్లను కరోనా కమ్మేస్తున్న నేపథ్యంలో జైళ్ల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ జైళ్ల శాఖ తీసుకుంటున్న జాగ్రత్తల కారణంగా ఇక్కడి కారాగారాల్లో మాత్రం ఇప్పటివరకు ఏ ఒక్క ఖైదీ కూడా కరోనా బారిన పడలేదు. ఈ పరిస్థితిని కొనసాగించాలనే ఉద్దేశంతో తాజా ప్రతిపాదన రూపొందించింది.
400 మందికి సరిపడా సదుపాయాలు
సంగారెడ్డి జిల్లా జైలులో ప్రస్తుతం 180 మంది ఖైదీలున్నారు. వీరిలో 13 మంది మహిళలు. ఈ జైలులో 400 మంది ఖైదీలను ఉంచేందుకు సౌకర్యాలున్నాయి. నిర్మాణ పరంగా దేశంలోనే ఉత్తమ జైళ్లలో ఇది ఒకటి. జైలు ఆవరణలోనే 20 పడకల ఆసుపత్రి, అంబులెన్స్‌ సదుపాయం ఉంది. అయితే ఓ వైద్యురాలితోపాటు నర్స్‌ మాత్రమే ఉన్నారు. జైలు సిబ్బంది 22 మందే. ఒకవేళ 400 మంది ఖైదీలను ఉంచాల్సి వస్తే ఆసుపత్రి, జైలు సిబ్బందిని పెంచాల్సి ఉంటుంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.