close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అస్మదీయుల అండతోనే ఉద్యమం పటిష్ఠం

మావోయిస్టుల వినూత్న వ్యూహం
లొంగిపోయిన వారిపైనా అగ్ర నాయకత్వం దృష్టి  

ఈనాడు, హైదరాబాద్‌:  ఒకప్పుడు తమకు పెట్టని కోట వంటి తెలంగాణలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న మావోయిస్టు అగ్రనాయకత్వం ప్రధానంగా సానుభూతిపరులు, గతంలో ఉద్యమంలో పాల్గొని లొంగిపోయినవారినే తిరిగి చైతన్యపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యమం బలపడాలంటే ముందు పటిష్ఠ క్యాడర్‌ ఉండాలి. కొత్త నియామకాల కోసం గతంలో చేసిన ప్రయత్నాలేవీ ఫలితమివ్వలేదు. వ్యూహం మార్చిన మావోయిస్టులు సానుభూతిపరులు, లొంగిపోయిన వారిని బలోపేతం చేసి,  గ్రామాల్లో యువకులను ఉద్యమంలోకి చేరేలా ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీన్ని గుర్తించిన నిఘా విభాగం వారి వ్యూహాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. రెండు వారాల వ్యవధిలో ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో మొత్తం నలుగురు సానుభూతిపరులను అరెస్టు చేయడమే ఇందుకు నిదర్శనం.
మావోయిస్టు ఉద్యమానికి తెలంగాణ ఒకప్పుడు కేంద్రంలా ఉండేదన్న సంగతి తెలిసిందే. కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి గణపతి మొదలు అనేక మంది అగ్రనాయకులు రాష్ట్రానికి చెందినవారే. కానీ పదేళ్లుగా తగులుతున్న ఎదురుదెబ్బల కారణంగా ఉద్యమం పూర్తిగా బలహీనపడింది. ఇప్పుడు రాష్ట్రానికి చెందిన మావోయిస్టుల సంఖ్య 200లోపే. వీరంతా ఎక్కువగా ఛత్తీస్‌గఢ్‌లోనే తలదాచుకుంటున్నారు. కొత్త నియామకాల కోసం కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నా యువత ఆసక్తిచూపడంలేదు. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలకు చెందిన ఆదివాసీల ద్వారా కార్యకలాపాలు నిర్వహించే ప్రయత్నం చేసినా ప్రయోజనం దక్కలేదు.
ఉద్యమం బలపడాలంటే స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని మావోయిస్టు అగ్రనాయకత్వం భావించింది. అజ్ఞాతంలో ఉన్న సానుభూతిపరులు, సాధారణ జీవితం గడుపుతున్న మాజీలు, తమతో కలిసి వచ్చే యువకులను గుర్తించి ఉద్యమంలో చేరేలా ప్రేరేపించాలన్నది ప్రణాళిక. దీనిలో భాగంగానే మంచిర్యాల-కొమురంభీం డివిజన్‌ కమిటీ కార్యదర్శి మైలారపు ఆదెల్లు అలియాస్‌ భాస్కర్‌ నేతృత్వంలోని పదిమంది సభ్యుల బృందం ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్‌  జిల్లాలో పర్యటించింది. పోలీసులు మూడు సందర్భాల్లో కాల్పులు జరిపినా తప్పించుకుంది. జులై 15న ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం తొక్కుగూడాలో కోవ వసంతరావు అనే మావోయిస్టు సానూభూతిపరుడ్ని అరెస్టు చేశారు. తాజాగా ఆదివారం మహబూబాబాద్‌ పోలీసులు బండి సుధాకర్‌, కల్తీ సమయ్య, పోలెబోయిన సారయ్య అనే సానుభూతిపరులను అరెస్టు చేసి భారీగా మందుగుండు స్వాధీనం చేసుకున్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా మావోయిస్టు అగ్రనేతలు పార్టీ మనుగడకు కొత్తరక్తం ఎక్కించే దిశగా కృషిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీన్ని నివారించేందుకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల యువతను చైతన్యపరచి, ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా ఉద్యమంవైపు ఆకర్షితులు కాకుండా చూడవచ్చని భావిస్తున్నారు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.