close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సేవల రంగంలో కుటుంబ సంస్థల సత్తా

ఐఎస్‌బీ పరిశోధనా పత్రం విశ్లేషణ

ఈనాడు, హైదరాబాద్‌: మనదేశంలో కుటుంబ వ్యాపార సంస్థలు ఉత్పత్తి రంగం నుంచి ఆర్థిక సరళీకరణ తర్వాత సేవల రంగంలోకి విజయవంతంగా విస్తరించగలిగినట్లు, ఇది ఎంతో ఆసక్తికర పరిణామమని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) పరిశోధనా పత్రం విశ్లేషించింది. ‘ఫ్యామిలీ బిజినెస్‌ అండ్‌ ఇండియాస్‌ ట్రాన్సిషన్‌ టూ ఏ సర్వీసెస్‌ లెడ్‌ ఎకానమీ- 1991-2018’ పేరుతో ఈ పత్రాన్ని ఐఎస్‌బీలోని థామస్‌ ష్మిథేని సెంటర్‌ ఫర్‌ ఫ్యామిలీ ఎంటర్‌ప్రైజ్‌ రూపొందించింది. నాస్‌కామ్‌ మాజీ ఛైర్మన్‌, సైయెంట్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ అయిన బీవీఆర్‌ మోహన్‌రెడ్డి దీన్ని విడుదల చేశారు. డాక్టర్‌ నుపుర్‌ పవన్‌బంగ్‌, నందిల్‌భాటియా, కవిల్‌రామచంద్రన్‌ (ఐఎస్‌బీ), సౌగతా రే (ఐఐఎం-కోల్‌కతా) ఈ పరిశోధనా పత్రాన్ని రూపొందించారు.
ఇందులోని ముఖ్యాంశాలు
* మనదేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు కాకముందు కుటుంబ వ్యాపార సంస్థలు ప్రధానంగా ఉత్పత్తి రంగంలో కొనసాగాయి. కానీ సంస్కరణలు అమల్లోకి వచ్చిన తర్వాత సేవల రంగంలో కొత్త వ్యాపార అవకాశాలను ఈ సంస్థలు అందిపుచ్చుకోగలిగాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... 2018 నాటికి అటు ఉత్పత్తి రంగంలో, ఇటు సేవల రంగంలో ఈ సంస్థలు అగ్రగామిగా ఉండటం.
* 2000 సంవత్సరం తర్వాత ఐటీ రంగం, ఆర్థిక సేవలు, టెలీకాం రంగాలు బహుముఖంగా విస్తరించాయి. ఈ రంగాల్లోనూ కుటుంబ వ్యాపార సంస్థలదే ఆధిపత్యం.
* వర్తకం, నిర్మాణ రంగం, గోదాముల నిర్వహణ, సరకు రవాణా వంటి సంప్రదాయ సేవల రంగాల్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవటంతో కుటుంబ వ్యాపార సంస్థలకు స్థిరమైన ఆదాయాలు లభిస్తున్నాయి.
* 2009- 16 మధ్య కాలంలో బ్యాంకింగ్‌ రంగానికి మొండి బాకీల భారం పెరగటంతో ఉత్పత్తి రంగానికి బ్యాంకు రుణాలు తగ్గిపోయాయి. అదే సమయంలో సేవల రంగంలో ఉన్న కుటుంబ వ్యాపార సంస్థలు మాత్రం తమ విస్తరణ కార్యకలాపాలకు అధిక మొత్తంలో రుణాలు పొందగలిగాయి.
* సేవల రంగంపై మనదేశం అధికంగా ఆధారపడుతోంది. అసంఘటిత రంగం కూడా పెద్దదే. ప్రాథమిక రంగాల్లోని కార్మికులను బయటకు తీసుకురావటానికి వీలుకల్పించే సమర్థమైన పారిశ్రామిక విధానాలను రూపొందించి అమలు చేయాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితి తేటతెల్లం చేస్తోంది. ప్రభుత్వం పెద్దఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వగలిగితే కుటుంబ వ్యాపార సంస్థలు ఉపాధి అవకాశాలను పెంపొందించటంతో పాటు వర్తక, వ్యాపార రంగాల్లో మరింత అభివృద్ధి కనబరచగలుగుతాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.