close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సగం పడకలు సర్కారు స్వాధీనం

ప్రైవేటు ఆసుపత్రుల తీరు మారకుంటే ఈ దిశగా కార్యాచరణ
ప్రణాళికలు రూపొందించాలని వైద్య మంత్రి ఆదేశాలు
ఫిర్యాదులపై ప్రత్యేక కమిటీ

ప్రైవేటు ఆసుపత్రుల్లో అడ్డగోలుగా రుసుముల వసూళ్లు, అనవసర పరీక్షలు, పడకల కృత్రిమ కొరత.. తదితర ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే రెండు ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోగా, ఇంకా తీరు మార్చుకోని పక్షంలో ‘ఎపిడిమిక్‌ డిసీజ్‌ యాక్టు’ కింద మరిన్ని కఠిన చర్యలు కూడా తీసుకోవడానికి వెనుకాడవద్దని ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అవసరమైతే ప్రతి ప్రైవేటు ఆసుపత్రిలోని ఐసీయూతో పాటు అన్ని తరహా పడకల్లోనూ 50 శాతం పడకలను స్వాధీనం చేసుకొని, ప్రభుత్వ ఆధ్వర్యంలో, సర్కారు నిబంధనల మేరకు కరోనా చికిత్సలను నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించింది. ప్రైవేటు ఆసుపత్రులపై ప్రజల నుంచి లిఖితపూర్వకంగా వచ్చిన ఆరోపణలపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ప్రధాన ఫిర్యాదులు ఇవీ..
ఇప్పటివరకు ప్రైవేటు ఆసుపత్రులపై 1039 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనవి..
* కరోనా చికిత్సల్లో ఎక్కువ బిల్లులు వేయడం.
* బిల్లులు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేయడం.
* రూ.3 నుంచి రూ.4 లక్షలు ముందుగా చెల్లిస్తే తప్ప ఆసుపత్రిలో చేర్చుకోకపోవడం. లేదంటే పడకలు ఖాళీ లేవంటూ రోగులను కనీసం పరీక్షించకుండానే తిప్పి పంపించడం.
* బీమా, క్రెడిట్‌ కార్డులను అంగీకరించకపోవడం, కేవలం నగదు చెల్లింపులకే అధిక ప్రాధాన్యమివ్వడం.
* డబ్బులు చెల్లించినా రోగులను సరిగా పట్టించుకోకపోవడం.
* చెల్లింపులు పూర్తిగా జరపకపోతే.. మృతదేహాన్ని కూడా ఇవ్వకపోవడం.
* కరోనా అనుమానిత లక్షణాలు లేకపోయినా.. కొవిడ్‌ పరీక్షల పేరిట డబ్బులు వసూలు చేయడం.
* ఇతర జబ్బుల చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయాలంటూ.. ప్యాకేజీల పేరిట డబ్బులు వసూలు చేయడం.
* ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షల నిర్వహణకు అనుమతులున్నా కూడా.. అవి చేయకుండా సీటీ స్కాన్‌, ఎక్స్‌రే, డీ డైమర్‌, ఎల్‌డీహెచ్‌, సీఆర్‌పీ, ఫెర్రిటిన్‌, ఐఎల్‌6 తదితర ఖరీదైన పరీక్షలను అవసరం లేకున్నా చేయడం.. ఈ పరీక్షల కోసం రూ.వేలల్లో వసూలు చేయడం.

తప్పు చేసినట్లు తేలితే కఠిన చర్యలే
వైద్యమంత్రి వద్ద సమావేశంలో ఈ ఫిర్యాదులపై ప్రధానంగా చర్చ జరిగింది. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదుపైనా సంబంధిత ఆసుపత్రి నుంచి సంజాయిషీ కోరామని అధికారులు వెల్లడించారు. ఆసుపత్రులిచ్చిన వివరణలను పరిశీలించడానికి సత్వరమే ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయాలని మంత్రి ఆదేశించారు. విచారణలో తప్పుగా తేలితే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడవద్దని స్పష్టం చేశారు. అంతకుముందు కేంద్ర బృందం వద్ద భేటీలోనూ ప్రైవేటు ఆసుపత్రుల అడ్డగోలు రుసుముల వసూళ్లపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఉన్నతాధికారులు కేంద్ర బృందానికి వివరించగా, బృంద సభ్యులు వాటిని సంపూర్ణంగా సమర్థించారు. ఎపిడిమిక్‌ డిసీజ్‌ యాక్టు కింద మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కేంద్ర బృందం సూచించింది. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల వైఖరిపై లోతుగా చర్చించారు. ఎన్నిసార్లు ప్రభుత్వం విజ్ఞప్తులు చేసినా.. ప్రైవేటు ఆసుపత్రులు తమ విధానాన్ని మార్చుకోవడం లేదని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. ఇకనైనా ప్రైవేటు ఆసుపత్రులు తమ తీరును మార్చుకోవాలని కోరారు. ఇలాగే కొనసాగితే ప్రైవేటులోని సగం పడకలను స్వాధీనం చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.