భూ ఆక్రమణల తొలగింపునకు మీ చర్యలేంటి?
close

ప్రధానాంశాలు

భూ ఆక్రమణల తొలగింపునకు మీ చర్యలేంటి?

తాజా నివేదికివ్వాలంటూ వక్ఫ్‌బోర్డుకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్‌భూముల ఆక్రమణలపై తీసుకుంటున్న చర్యలను తెలుపుతూ నివేదిక ఇవ్వాలని వక్ఫ్‌బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడు ఆక్రమణల తొలగింపునకు 2,186 నోటీసులు ఇవ్వగా, ప్రస్తుతం 989 కేసుల వివరాలను గుర్తించామని, అందులోనూ 85 నోటీసులకు సంబంధించిన దస్త్రాలే ఉన్నాయనడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది. మొత్తం ఆక్రమణలకు గురైన భూములను గుర్తించి వాటిని తొలగించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంది. కోర్టులు, ట్రైబ్యునళ్లలో ఉన్న కేసుల సత్వర విచారణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. వక్ఫ్‌భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోకపోవడంతో పాటు శ్మశానాలు ఆక్రమణలకు గురవుతున్నా వక్ఫ్‌బోర్డు పట్టించుకోకపోవడాన్ని సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త మహమ్మద్‌ ఇలియాస్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వక్ఫ్‌బోర్డు తరఫు సీనియర్‌ న్యాయవాది డి.వి.సీతారామ్మూర్తి వాదనలు వినిపించారు. వక్ఫ్‌బోర్డు సీఈవో దాఖలు చేసిన నివేదికను పరిశీలించిన ధర్మాసనం పెండింగ్‌ కేసులతో పాటు ఇతర వివరాలు, చర్యలపై తాజా నివేదిక సమర్పించాలంటూ విచారణను ఆగస్టు 12కి వాయిదా వేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని