close

ఆమెకు రక్షణ... ఆకతాయిలకు దండన

పోకిరీల పీచమణుస్తున్న ‘షి’బృందాలు
మూడేళ్లలో 5716 ఫిర్యాదులు...
1547 మంది ఈవ్‌టీజర్లకు జైలు
సత్ఫలితా లిస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు

కళాశాలలు... కార్యాలయాలు... ఇంటాబయటా..  మహిళలకు ఈవ్‌టీజింగ్‌... వేధింపులు.. మెట్రోనగరాల్లో పెరుగుతున్న నేరాలు...హైదరాబాద్‌లోనూ తీవ్రతరంగా మారుతున్న వీటికి అడ్డుకట్ట వేయాలని పోలీస్‌ ఉన్నతాధికారులు మూడేళ్ల క్రితం ‘షి’బృందాలను తెరపైకి తెచ్చారు. ఆమెకు రక్షణగా ఉండాలన్న లక్ష్యంతో ‘షి’ టీం పేరుతో హైదరాబాద్‌లోనే 100 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా మూడేళ్లలో ‘షి’బృందాలు ఈవ్‌టీజింగ్‌, వేధింపుల బారిన పడుతున్న బాధితులకు అండగా నిలబడ్డాయి. విద్యార్థినులు, యువతులు, మహిళలను వేధిస్తున్న ఆకతాయిలను పట్టుకుని జైలుకు పంపిస్తున్నాయి. బాధితుల ఆవేదన తీవ్రత, నిందితుల నిర్లక్ష్యాన్ని  పరిగణనలోకి తీసుకుని కొందరు ఈవ్‌టీజర్లు, పోకిరీలపై పీడీ చట్టం ప్రయోగిస్తున్నాయి. బస్సులు, బస్‌స్టాప్‌లు, రైల్వేస్టేషన్లు, ఎంఎంటీఎస్‌ రైళ్లు, మెట్రోరైళ్లు, పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు సంచరిస్తూ నేరస్థులు, పైశాచికంగా ప్రవర్తిస్తున్న వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నాయి. ఇలా 2015 నుంచి 2018 వరకు ఐదు వేలకుపైగా కేసులు నమోదు చేసి 1547 మందిని జైలుకు పంపించారు.

సాధారణ పోలీసు విధులకు భిన్నంగా..
సాధారణ పోలీస్‌ విధులకు భిన్నంగా ‘షి’ బృందం సభ్యులు విధులు నిర్వహిస్తున్నారు. పోకిరీలు, ఈవ్‌టీజర్లను పట్టుకునేందుకు వీరు మారువేషాలతో వెళ్తున్నారు. యువతులు, మహిళలను వేధిస్తున్న వారి తీరును వీడియోద్వారా చిత్రీకరించి శ్రుతిమించే సమయంలో అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందుకోసం ‘షి’ బృందాల సభ్యుల ఎంపిక నుంచి శిక్షణ వరకూ నేర విభాగం వివిధ అంశాలపై కసరత్తు చేసింది. మహిళా కానిస్టేబుళ్ల వస్త్రధారణ మార్చడంతోపాటు పోలీసుల సహజసిద్ధమైన దర్పం కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వేషధారణ నుంచి మాట్లాడే భాష వరకూ శిక్షణ ఇప్పించారు. బస్‌స్టాపుల్లో విద్యార్థినులతో కలిసిపోయేందుకు వారు అక్కడి విద్యార్థులతో వారికి సంబంధించిన అంశాలపైనే  మాట్లాడడం, మహిళా ఉద్యోగినులైతే వారికి సంబంధించి అంశాలు మాట్లాడడం వంటివి నేర్పించారు. ఆధునికంగా దుస్తులు ధరించినా అందులో రహస్యంగా కెమెరాల ఏర్పాటు, వీరితోపాటు ఉండే ఇద్దరు కానిస్టేబుళ్లకు అత్యాధునిక ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇచ్చారు.

తీవ్రంగా వేధిస్తే నిర్భయ చట్టం ప్రయోగం
యువతులు, మహిళలను వేధిస్తున్నవారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వేధించే వారిలో విద్యార్థులు, యువకులు ఉంటే వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మరోమారు ఇలాంటి చర్యలకు పాల్పడబోమంటూ లిఖితపూర్వకంగా హామీ తీసుకుని పెట్టీ కేసులు పెడుతున్నారు. మిగతావారి విషయంలో తరచూ ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై నిర్భయ చట్టం ప్రయోగిస్తున్నారు. ఐపీసీ 354 ఎ, బి, సి, డి సెక్షన్ల ప్రకారం తీవ్రత ఆధారంగా నిందితులపై కేసులు నమోదుచేసి జైలుకు పంపుతున్నారు. ఇప్పటివరకు 125 మందిపై నిర్భయ కేసులు నమోదు చేశారు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ద్వారా వేధించినా, ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడినా నిర్భయ చట్టం ప్రయోగిస్తున్నారు. మహిళలు, యువతుల ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా ఆయా ప్రాంతాల్లోనే హెల్ప్‌డెస్క్‌లను ప్రారంభించారు. రెండేళ్ల క్రితం ‘భరోసా... షి’ బృందాల కార్యాలయాన్ని హైదరాబాద్‌లో శాసనసభ ఎదురుగా హాకాభవన్‌లో ప్రారంభించారు. ఈవ్‌టీజింగ్‌, వేధింపులపై ‘షి’ టీం సభ్యులు అవగాహన శిబిరాలు, చైతన్య కార్యక్రమాలు నిర్వహస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, బస్‌స్టాప్‌లు, బస్సులు, మహిళా వసతి గృహాలు, షాపింగ్‌మాల్స్‌కు వెళ్లి అక్కడ యువతులు, మహిళలతో మాట్లాడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో కరపత్రాలు పంచుతూ పోస్టర్లు, స్టిక్కర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. వాస్తవిక ఘటనల స్ఫూర్తితో రూపొందించిన లఘుచిత్రాలను ప్రదర్శిస్తున్నారు.

రాజధానిలో విజయవంతం అవడంతో...
పోకిరీలు, ఈవ్‌టీజర్ల చేష్టలకు ఏమీ చేయలేని నిస్సహాయతతో మౌనంగా ఉంటున్న యువతులు, మహిళలకు ‘షి’ బృందాలు ధైర్యాన్నిస్తున్నాయి. ‘షి’ బృందాలకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు వస్తుండడంతో.. తొలుత హైదరాబాద్‌లో ప్రారంభించిన ‘షి’ బృందాలను సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్లలోనూ అందుబాటులోకి తీసుకువచ్చారు. మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో ఈవ్‌టీజింగ్‌ తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలోని పాత పది జిల్లా కేంద్రాల్లోనూ వీటిని ప్రారంభించారు. ‘షి’ బృందాల పనితీరు బాగుండడం, బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేస్తుండడంతో ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు ‘షి’ బృందాల తరహాలో ప్రత్యేక దళాలను ఏర్పాటు చేశాయి.

- ఈనాడు, హైదరాబాద్‌

 

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.