close
గోవుల్లోనూ అద్దె గర్భం

అధికంగా పాలిచ్చే ఆవుల సృష్టి
ఎంపిక చేసిన జీవాల నుంచి అండం, వీర్యం సేకరణ
వీటిని ప్రయోగశాలలో కలిపి ఫలదీకరణ
అక్కడ తయారైన పిండాన్ని ఆవులో ప్రవేశపెడతారు
ఈ సాంకేతికతతో పుట్టే గోవుల నుంచి అధిక క్షీరం
అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పరిజ్ఞానం వాడకం
ఇక్కడా సిద్ధమని ముందుకొచ్చిన ప్రైవేటు సంస్థ
అమెరికా కంపెనీ, ఎన్డీడీబీతో ఒప్పందం
తెలుగు రాష్ట్రాల్లో పాల వెల్లువకు అవకాశం

అద్దె గర్భం (సరోగసీ)... ఈ మాట మనం తరచూ వింటున్నాం. పిల్లలు లేని దంపతులు అద్దె తల్లి నుంచి బిడ్డకు జన్మనిచ్చేలా ఏర్పాటు చేయడం అన్నమాట. అచ్చం ఇలాగే పాడి ఆవుల్లోనూ సరోగసీ విధానంతో మేలైన, అధికంగా పాలిచ్చే ఆవు జాతిని సృష్టించడానికి నూతన పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దీన్ని పిండం తరలింపు పరిజ్ఞానం (‘ఎంబ్రియా ట్రాన్స్‌ఫర్‌ టెక్నాలజీ’-ఈటీటీ) అనే పేరుతో పిలుస్తున్నారు. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ఎప్పటి నుంచో ఉంది. భారతదేశంలో సైతం గుజరాత్‌లో ‘జాతీయ పాడి అభివృద్ధి మండలి’(ఎన్డీడీబీ) గతంలో ఈ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. కానీ ఇది ఖరీదైన వ్యవహారం అని చాలా రాష్ట్రాలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈటీటీని రైతుల ఇళ్లకెళ్లి వారు తెలిపిన పాడి ఆవులకు అందజేయడానికి హైదరాబాద్‌కు చెందిన ‘ట్రాపికల్‌ బొవైన్‌ జెనెటిక్స్‌’(టీబీజీ) అనే ఓ ప్రైవేటు కంపెనీ ముందుకొచ్చింది. అమెరికాలోని ట్రాన్స్‌ఓవ జెనెటిక్స్‌ అనే కంపెనీతో హైదరాబాద్‌కు చెందిన టీబీజీ కంపెనీ ఈటీటీ పరిజ్ఞానం తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంది. ఇదే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి రూ.12 కోట్లు ఇస్తే ప్రయోగశాల ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ(ఎల్‌డీఏ) రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపింది. ఏపీలో ప్రయోగాత్మకంగా ప్రైవేటు కంపెనీ ద్వారా అమలుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఈటీటీ ఎలా పనిచేస్తుంది
సాధారణంగా మన రైతుల ఇళ్లలో ఉండే ఆవులు తక్కువగా పాలు ఇస్తుంటాయి. వాటి పోషణ ఖర్చులు పెరుగుతున్నందున పెద్దగా ఆదాయం రావడం లేదు. ఈ నేపథ్యంలో అధికంగా పాలిచ్చే ఆవులను పుట్టించడానికి ఈటీటీ పరిజ్ఞానం బాగా ఉపయోగపడుతుంది. గుజరాత్‌లో ఎన్డీడీబీ తరఫున అధికంగా పాలిచ్చే ఆవులను పెంచే క్షేత్రాలున్నాయి. ఎక్కువ పాలలిచ్చే ఆవు నుంచి అండం, మేలైన ఎద్దు(గిత్త) నుంచి వీర్యం సేకరిస్తారు. ఈ రెండింటి వివరాలన్నీ నమోదు చేస్తారు. ఆవు రోజుకు ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది, దాని తల్లి ఎన్ని లీటర్లు ఇచ్చేది దాని పోషణ వివరాలన్నీ నమోదవుతాయి. ఇలాగే వీర్యం తీసుకునే ఎద్దును కన్న ఆవు, జాతి, ఇవి ఎన్ని పాలిచ్చేవి.. తదితర సమాచారాన్ని నమోదు చేస్తారు. అండం, వీర్యాన్ని ప్రయోగశాలలో శాస్త్రీయ విధానంలో కలిపి భద్రపరుస్తారు. ఇవి ఫలదీకరణం చెందడంతో పిండం(ఎంబ్రియో) ఏర్పడుతుంది. ఏడు రోజుల వయసున్న పిండాన్ని జాగ్రత్తగా మైనస్‌ 192 డిగ్రీల వద్ద ద్రవ నత్రజని వాహనంలో భద్రపరిచి గ్రామాలకు తరలిస్తారు. అక్కడ ఈటీటీ కోసం దరఖాస్తు చేసిన రైతు ఇంటికి వెళ్లి వారి సొంత పాడి ఆవులోకి ఎంబ్రియోను ప్రవేశపెడతారు. ఆ పిండం పెరిగి 9 నెలలకు మేలైన దూడ పుడుతుంది. అంటే అద్దె తల్లిలా రైతు ఇంటిలోని ఆవు ఉపకరిస్తుంది. సదరు దూడను 18 నెలలు మేలైన దాణాతో పెంచి పోషిస్తే దానికి మళ్లీ ఈటీటీ పరిజ్ఞానంతో పిండాన్ని ప్రవేశపెడతారు. 9 నెలల అనంతరం అది మేలైన దూడకు జన్మనిస్తుంది. అది అధికంగా పాలు ఇస్తుంది. ఎంబ్రియోను ఎంపిక చేసుకునేటపుడే రోజుకు ఎన్ని లీటర్ల పాలిచ్చే ఆవు కావాలో దాని చరిత్ర రికార్డులు చూసి నిర్ణయించవచ్చు. ఒకవేళ ఆవు కాకుండా మగదూడ పుట్టినా దాని వీర్యానికి అధిక డిమాండు ఉంటుంది. ఈ మేలైన గిత్త ధర ఉత్తరాది రాష్ట్రాల్లో ఒక్కోదానికి రూ.2 లక్షల వరకూ ఉంటోంది.

ఏమిటి లాభం?
మన సాధారణ దేశవాళీ ఆవు ఒక ఈతలో సగటున 700 లీటర్లకు మించి పాలివ్వడం లేదు. రోజుకు సగటున గరిష్ఠంగా ఆరేడు లీటర్లు ఇస్తున్నాయి. చాలా ఆవులు 2 నుంచి 3 లీటర్లే ఇస్తున్నాయి. ఈటీటీ పరిజ్ఞానంతో పుట్టేవి రోజుకు 15 నుంచి 20 లీటర్లు ఇస్తున్నాయి. గుజరాత్‌లో సాహివాల్‌, గిర్‌ దేశవాళీ ఆవుల సంకరజాతితో ఈటీటీ విధానంలో పుట్టేవాటితో రైతులకు ఖర్చులన్నీ పోను నెలకు గరిష్ఠంగా రూ.6 వేల వరకూ మిగులుతున్నట్లు అధ్యయనంలో తేలింది. కానీ ఒక రైతు ఇంటిలోని ఆవుకు ఈటీటీ విధానం ద్వారా పిండాలను కనీసం నాలుగైదు సార్లు ప్రవేశపెట్టాలి. ఇందుకోసం రూ.25 వేల దాకా ఖర్చవుతుందని అంచనా.

లాభదాయకమే
ఈటీటీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇది లాభదాయక విధానమే. కానీ ఖర్చుతో కూడుకున్నది. పాల ఉత్పత్తి పెరుగుతుంది.

-మంజువాణి, సంచాలకురాలు, ఎల్‌డీఏ, తెలంగాణ
- ఈనాడు, హైదరాబాద్‌
 

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.