close

దస్తావేజు లేఖరులు ఆడిందే ఆట

సబ్‌రిజిస్ట్రార్లకు అన్నీ తెలుసు
సిబ్బంది కొరతతో అనధికారికంగా వారిని కొనసాగిస్తున్న వైనం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో దస్తావేజు లేఖరులు ఆడిందే ఆటగా ఉంది. రోజూ వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేయాల్సి రావడం, దీనికి తోడు కావాల్సినంత మంది సిబ్బంది లేకపోవడంతో సబ్‌రిజిస్ట్రార్లు వారి పట్ల కఠినంగా ఉండలేకపోతున్నారు. ఎలాంటి డాక్యుమెంట్లు కావాలన్నా ప్రజలు నేరుగా దస్తావేజు లేఖరుల దగ్గరకే వెళ్తున్నారు. ఉదయం పది గంటలకు వారిని సంప్రదిస్తే మధ్యాహ్నంలోగా అన్నీ సిద్ధం చేసి, ఫైలు సబ్‌రిజిస్ట్రార్ల ముందు పెట్టేస్తున్నారు. సిబ్బంది, అధికారులు చేయాల్సిన పనిలో 90శాతం పనిని వాళ్లే పూర్తి చేస్తుండడంతో సబ్‌రిజిస్ట్రార్లు సైతం మిన్నకుండిపోతున్నారు.

భారీగా నొక్కేస్తున్నారు..
ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకొని లేఖరులు భారీగా వెనకేసుకుంటున్నారు. కొన్ని చోట్ల ఎకరాకు 20వేల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. చాలాచోట్ల సబ్‌రిజిస్ట్రార్లు, లేఖరులు కుమ్మక్కై బహిరంగంగానే వసూళ్లకు పాల్పడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఇటీవల ఓ వ్యక్తి తన భూమి రిజిస్ట్రేషన్‌ కోసం లేఖరిని సంప్రదించాడు. పని పూర్తయ్యాక సాంకేతిక కారణాలను సాకుగా చూపిస్తూ ఎకరాకు రూ.20వేలు డిమాండ్‌ చేశాడు. ఇందులో సబ్‌రిజిస్ట్రార్‌ పాత్ర కూడా ఉందని తేలడంతో ఏసీబీ రంగప్రవేశం చేసి రూ.30వేలు లంచం తీసుకుంటుండగా ఇద్దరినీ అదుపులోకి తీసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో నయీం భూముల విక్రయం కేసులోనూ ఓ లేఖరి కీలకంగా వ్యవహరించినట్లు అధికారుల విచారణలో తేలింది.

ఇదీ అసలు సమస్య...
సబ్‌రిజిస్ట్రార్‌ రోజు మొత్తంలో 40 దస్తావేజులకు మించి రిజిస్ట్రేషన్‌ చేయలేడు. రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రోజుకు 6వేల నుంచి 7వేల దస్తావేజులు రిజిస్టర్‌ అవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఒక్క సబ్‌రిజిస్ట్రార్‌ ఉన్న చోట రోజూ 100 నుంచి 150, ఇద్దరున్న దగ్గర 200 నుంచి 250 రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఒక్కో కార్యాలయంలో 11 నుంచి 15 మంది సిబ్బంది అవసరం ఉంటే.. కేవలం నలుగురైదుగురు మాత్రమే అందుబాటులో ఉన్నారు. దాదాపు 20 ఏళ్లుగా పోస్టుల సంఖ్య పెంచలేదు. ఏడాదికి 24 లక్షల రిజిస్ట్రేషన్లు అయ్యే తమిళనాడు రాష్ట్రంలో 570 రిజిస్ట్రార్‌ కార్యాలయాలుంటే.. 16 లక్షలు అయ్యే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 141 ఉన్నాయి.

లేఖరుల వ్యవస్థ ఎప్పుడో రద్దయింది
దస్తావేజు లేఖరుల వ్యవస్థను ప్రభుత్వం 2001లోనే రద్దు చేసింది. వారికి ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్‌ విధానం, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో సహాయ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చాం. ప్రజలకు అవగాహన లేక నేటికీ దస్తావేజు లేఖరులనే ఆశ్రయిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఏ పనైనా ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. దరఖాస్తును ఎలా నింపాలో కూడా వెబ్‌సైట్‌లోనే ఉంటుంది. సిబ్బంది కొరత ఉన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.

-చిరంజీవులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ

 

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.