close
తప్పులపై ముందే జేఎన్‌టీయూహెచ్‌ హెచ్చరిక!

అయినా అప్రమత్తంకాని గ్లోబరీనా టెక్నాలజీస్‌
అందుకే వేల మంది ధ్రువపత్రాలపై ‘ఏఎఫ్‌, ఏపీ’ అని ముద్రణ
 ఫలితాల వెల్లడి తర్వాత  సరిదిద్దిన సంస్థ

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాల్లో తప్పులు దొర్లే అవకాశముందని జేఎన్‌టీయూహెచ్‌ నిపుణులు ముందే గ్లోబరీనా టెక్నాలజీస్‌ సంస్థను హెచ్చరించినట్లు తెలిసింది. వేలాది మందిని ఆందోళనకు గురిచేసిన ‘ఏఎఫ్‌, ఏపీ’ గురించి జేఎన్‌టీయూహెచ్‌ ముందుగానే ఆ ప్రైవేటు సంస్థను అప్రమత్తం చేసిందని విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఇంటర్‌ ఫలితాలు ఈ నెల 18న విడుదలకాగా.. రెండో సంవత్సరంలో సుమారు 28,500, ప్రథమ సంవత్సరంలో దాదాపు 11 వేల మంది ధ్రువపత్రాలపై ‘ఏఎఫ్‌ లేదా ఏపీ’ అని వచ్చింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఫలితాల విడుదల తర్వాత దీన్ని గుర్తించిన గ్లోబరీనా సంస్థ వాటిని సరిచేసింది. ఆ సరిచేసిన సీడీ కేవలం ఇంటర్‌బోర్డు వద్దే ఉంది. అంటే ఒక వేళ సరిచేసినా ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో చూస్తేనే తెలుస్తుంది. ఫలితాల విడుదల రోజు వివిధ వెబ్‌సైట్లకు ఇచ్చిన సీడీల్లో ఇప్పటికీ పాతవే ఉన్నాయి. ఫలితాల విడుదల ముందు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి సూచన మేరకు ఇంటర్‌బోర్డు జేఎన్‌టీయూహెచ్‌ సహకారం తీసుకుంది. విశ్వవిద్యాలయం నిపుణులు పలుమార్లు ఇంటర్‌బోర్డుకు వచ్చి ఫలితాల ప్రక్రియ విధానాన్ని చూస్తున్న గ్లోబరీనా సంస్థ సాఫ్ట్‌వేర్‌ను పరిశీలించారు. ఫలితాల్లో పాస్‌, ఫెయిల్‌ అని కాకుండా ఏఎఫ్‌, ఏపీ అని వస్తుందని, వాటిని సరిచేసుకోవాలని అప్రమత్తం చేశారు. ఇంకా మౌఖికంగా మరికొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. అయితే సంస్థ సిబ్బంది ఆ లోపాన్ని సరిచేయలేదు. వర్సిటీ నిపుణులు హెచ్చరించినట్లుగానే తప్పులు దొర్లాయి.

ఏమిటీ ఏఎఫ్‌, ఏపీ?
సాధారణంగా ఫెయిలైతే ఎఫ్‌, పాస్‌ అయితే పి అని రాస్తారు. విద్యార్థి గైర్హాజరు అయితే ఆబ్సెంట్‌ అంటూ ‘ఏ’ అని రాస్తారు. ఈసారి వేలాది మార్కుల జాబితాలపై ఏఎఫ్‌ లేదా ఏపీ అని రావడంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతామనుకుంటే అర్థం లేని రాతలు రావడంతో ఆందోళన చెందారు. ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌ సోమవారం మీడియాకు వివరణ ఇస్తూ ఏఎఫ్‌ అంటే ఆబ్సెంట్‌ అండ్‌ ఫెయిల్‌ అని, ఏపీ అంటే ఆబ్సెంట్‌ అండ్‌ పాస్‌ అని చెప్పారు. ఏదైనా కారణంవల్ల తనకు కేటాయించిన కేంద్రంలో కాకుండా, మరో కేంద్రంలో పరీక్ష రాసే విద్యార్థి మార్కుల జాబితాపై మాత్రమే ఏపీ లేదా ఏఎఫ్‌ లు ఉంటాయన్నారు. ఫలితాల విడుదల తర్వాత వాటిని సరిచేశారు. రెండుమూడు కేంద్రాల్లోనే ఇది జరిగిందని అధికారులు చెబుతున్నా.. తొలుత ప్రకటించిన ఫలితాల్లో ఇది వేలాది విద్యార్థుల ధ్రువపత్రాల్లో రావడం గమనార్హం. అనంతరం బోర్డు అధికారిక వెబ్‌సైట్లో మాత్రమే వీటిని సరిచేశారు.

 

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.