close
మందుల కొనుగోళ్లలో మతలబు

ఉత్పత్తి సంస్థలతో ప్రభుత్వ ఫార్మసిస్టుల కుమ్మక్కు
కొందరు వైద్యులతో కలిసి దళారుల అవతారం
ముడుపులు తీసుకొని అవసరాలకు మించి అధిక కొనుగోళ్లు
వచ్చే మూడు నెలల్లోపే గడువు తీరనున్న రూ.3.5 కోట్ల విలువైన ఔషధాలు
ఏడాదికి రూ.14 కోట్ల నష్టం!
బాధ్యులైన ఏడుగురు ఫార్మసిస్టులపై చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేసే ఔషధాల కొనుగోళ్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఔషధ ఉత్పత్తి సంస్థలతో కుమ్మక్కైన కొందరు ప్రభుత్వ ఫార్మసిస్టులు నిబంధనలను ఉల్లంఘించారు. వైద్యులతోనూ లాలూచీ పడి అవసరానికి మించి ఔషధాలు కావాలన్నట్లుగా దరఖాస్తు (ఇండెంట్‌) సమర్పించే విధంగా ఫార్మసిస్టులే దళారుల పాత్ర పోషించారు. ఆ దరఖాస్తుల ఆధారంగా అడ్డగోలుగా ఆయా ఔషధాలు, శస్త్రచికిత్స వస్తువులను కొనుగోలు చేశారు. కొనుగోళ్ల బాగోతంలో పెద్దఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. దీనిపై అంతర్గత విచారణ చేపట్టిన తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ).. అక్రమాలు చోటుచేసుకున్నట్లుగా నిర్ధారించింది. అవసరం లేకపోయినా పెద్దఎత్తున ఔషధాలను కొనుగోలు చేసినట్లుగా గుర్తించింది. వచ్చే మూడు నెలల్లోపే దాదాపు రూ.3.5 కోట్ల విలువైన ఔషధాల గడువు తేదీ ముగియనున్నట్లు గ్రహించింది. ప్రస్తుత పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించింది. దీంతో సర్కారు అత్యవసర చర్యలు చేపట్టింది. ముందుగా ఈ అక్రమాలకు బాధ్యులుగా భావించిన ఏడుగురు ఫార్మసిస్టులను ఆ విధుల నుంచి తప్పించింది.

వరంగల్‌లో తొలుత వెలుగులోకి..
ఔషధాలు, శస్త్రచికిత్స వస్తువుల కొనుగోలు కోసం వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి కేటాయించిన నిధుల్లో అక్రమాలు చోటుచేసుకున్న విషయం గత ఏడాది నవంబరులో వెలుగులోకి వచ్చింది. వరంగల్‌లోని కేంద్ర ఔషధ గిడ్డంగితో సంబంధం లేకుండా ఆసుపత్రిలోని ఫార్మసిస్టే ఉత్పత్తి సంస్థతో నేరుగా సంబంధాలు నెరిపి కొనుగోళ్లలో కీలక పాత్ర పోషించాడు. దాదాపు రూ. 2.5 కోట్ల విలువైన ఔషధాలు, శస్త్రచికిత్స వస్తువులను ఒకే ఉత్పత్తి సంస్థ నుంచి కొనుగోలు చేయడంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆసుపత్రిలో ఏడేళ్ల నుంచి ఒకే ఫార్మసిస్టు తిష్ట వేసి ఉండడంతో.. ఉత్పత్తి సంస్థతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని అవసరానికి మించి ఔషధాలు కొన్నట్లుగా విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో వైద్యవిద్య సంచాలకుల పరిధిలోని బోధనాసుపత్రులు, ఇతర దవాఖానాలకు కేటాయించిన ఔషధాల నిధుల్లో గోల్‌మాల్‌పైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది.

ట్రెమడాల్‌తో మరింత లోతుల్లోకి..
వరంగల్‌ ఉదంతం వెలుగులోకి వచ్చిన అనంతరం టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ కూడా తమ వద్ద ఉన్న ఔషధ నిల్వలపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో రోగ నిరోధక టీకాల అనంతరం ‘ట్రెమడాల్‌’ మాత్రల వినియోగంతో ఇద్దరు చిన్నారులు మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఔషధాల కొనుగోలు, నిల్వలపై మరింత లోతుగా ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ పరిశీలనలో మరిన్ని నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పెద్ద శస్త్రచికిత్సలు, రోడ్డు ప్రమాదాలు తదితర ఘటనల్లో నొప్పి నివారణ ఔషధంగా మాత్రమే వినియోగించాల్సిన ట్రెమడాల్‌ మాత్రలను పెద్దఎత్తున కొనుగోలు చేసినట్లుగా తేలింది. రూ.5.5 కోట్ల విలువైన 55 లక్షలకుపైగా ట్రెమడాల్‌ మాత్రలు కొన్నారు. వాటిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకూ సరఫరా చేశారు. చిన్నారుల మృతి అనంతరం తప్పును గుర్తించిన వైద్యఆరోగ్యశాఖ.. మిగిలిన 33 లక్షల ట్రెమడాల్‌ ఔషధాలను అన్ని స్థాయిల ఆసుపత్రుల నుంచి వెనక్కి రప్పించింది. మరిన్ని అక్రమాలు జరిగినట్లుగా ఈ పరిశీలనలోనే వెల్లడైంది.

శాఖాపరమైన చర్యలు
ప్రతి 3 నెలలకు సుమారు రూ. 3.5 కోట్ల విలువైన ఔషధాలు, శస్త్రచికిత్స వస్తువులు మురిగిపోతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఏడాదికి దాదాపు రూ. 14 కోట్ల మేరకు నష్టం వాటిల్లే విధంగా అక్రమాలకు పాల్పడుతున్న బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. గడువు తీరిపోనున్న ఔషధాలను వెనక్కి పంపించడంతోపాటు అసలు ఇంత భారీగా అవసరానికి మించి ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందనే అంశంపైనా టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ విచారణ చేపట్టింది. ట్రెమడాల్‌ సహా ఇతర ఔషధాలను అవసరాలకు మించి కొనుగోలు చేయడంలో ఫార్మసిస్టులు కీలక పాత్ర వహించారని నిర్ధారించింది. వారు ఏళ్లుగా ఒకే చోట ఉండడంతో ఈ తరహా అవినీతికి ఆస్కారం ఏర్పడిందని గుర్తించింది. వరంగల్‌లో ఇద్దరిని, హైదరాబాద్‌ కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న ఐదుగురిని.. మొత్తంగా ఏడుగురు ఫార్మసిస్టులను ప్రజారోగ్య సంచాలకుల విభాగానికి సరెండర్‌ చేసింది. వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

మురిగిపోనున్న 155 రకాల ఔషధాలు
అడ్డగోలుగా, ఇష్టారాజ్యంగా ఔషధాలను కొనుగోలు చేయడంతో వచ్చే జులై 31 నాటికి దాదాపు 155 రకాల ఔషధాల వినియోగ గడువు తీరనున్నట్లుగా తేలింది. సుమారు రూ.3.5 కోట్ల విలువైన ఔషధాలు, శస్త్రచికిత్స వస్తువులు మురిగిపోయే ప్రమాదం ఉండడంతో.. వాటిని అత్యవసరంగా వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 155 రకాల ఔషధాల్లో 70 రకాలు ఎక్కువగా వినియోగంలో ఉన్నవి కావడంతో ఎక్కడైతే ఆయా ఔషధాలను  ఎక్కువగా వినియోగిస్తున్నారో.. అక్కడికి వాటిని మళ్లించాలని ఆదేశించింది. ఇక అరకొర వాడకమున్న 85 రకాల ఔషధాలను తక్షణమే వెనక్కి రప్పించి.. ఒప్పందం మేరకు ఉత్పత్తి సంస్థలకు వాటిని తిరిగి అప్పగించాలని నిర్ణయించింది.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.