close
తప్పనున్న ముంపు ముప్పు 

రాజధాని కోసం జేఎన్‌టీయూ ప్రణాళిక 
1,548 కిలో మీటర్ల మేర పైపులైన్లతో 650 చెరువుల్లోకి వర్షం నీరు మళ్లింపు 
నివేదికకు బల్దియా ఆమోదముద్ర 
మొదటి దశ కింద రూ.407 కోట్లతో పనులు 
సర్కారు ఆమోదమే తరువాయి 
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

భారీ వర్షాల పడిన ప్రతి సమయంలోనూ రాజధాని ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రధాన రోడ్లపై మోకాలిలోతు నీళ్లు చేరతాయి. వాహనాలు ముందుకు కదలవు. కాలనీల్లో ఇళ్లు మునుగుతాయి... కారణం నిజాం కాలంలో నిర్మించిన మూడువేల చెరువులు దానికి అనుబంధంగా ఉన్న వరద కాలువలు ఆక్రమణలకు గురికావడమే! దీనికి జేఎన్‌టీయూ విపత్తుల నిర్వహణ విభాగం సరికొత్త విరుగుడును రూపొందించింది. మహానగరంలోని ప్రధాన ప్రాంతాల్లో వందలాది చెరువులను తవ్వి పైపులైను ద్వారా ముంపు ప్రాంతాల నుంచి నీటిని ఇందులోకి తరలించేలా ప్రణాళిక రూపొందించింది. ఇదే విధంగా ఇళ్లలోనూ, ఖాళీ స్థలాల్లోనూ లక్షకు పైగా ఇంకుడు గుంతలను తవ్వించాలని సూచిస్తోంది. మొత్తం రూ.4,933 కోట్ల ఈ ప్రాజెక్టుకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (జీహెచ్‌ఎంసీ) స్థాయీ సంఘం ఇటీవల ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే దశలవారీగా ఈ ప్రాజెక్టును అమలులోకి తేవాలని నిర్ణయించారు. గతంలో నగరంలో పడిన వర్షం నాలాలు, వరద కాలువల ద్వారా చెరువుల్లోకి చేరేది. ఇప్పుడు ఇవన్నీ కబ్జాదారుల కోరల్లో చిక్కాయి. నగరాన్ని వరద ఉపద్రవంనుంచి బయటపడేసేందుకు హైదరాబాద్‌ జేఎన్‌టీయూ విపత్తుల నిర్వహణ విభాగం ఫ్రొఫెసర్‌ లక్ష్మణరావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ నగరాన్ని సాంకేతిక పద్ధతుల ద్వారా మదింపుచేసి సరికొత్త ప్రణాళికనురూపొందించింది.

చెరువుల నిర్మాణమే మార్గం 
హైదరాబాద్‌లోని 750 చదరపు కిలో మీటర్ల పరిధిలో ప్రధాన రోడ్లలోని 229 ప్రాంతాల్లో వరదనీరు అధికంగా నిలిచిపోవడం వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని ఈ నిపుణుల కమిటీ గుర్తించింది. ఈ నిల్వ ప్రాంతాల నుంచి నీటిని పైపులైను ద్వారా తరలించేలా ప్రణాళిక రూపొందించింది. 
ప్రధాన రోడ్లలో 456 కిలో మీటర్ల పొడవున పైపులైను వేసి నీటిని నగరం బయటకు తీసుకెళ్తారు. 
ఇలా వచ్చే నీటికోసం 650 చెరువులను నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుతం 300 చెరువుల్లో ఉన్న ఆక్రమణలను కూడా తొలగించి వినియోగంలోకి తెస్తారు. 
ఇదే కాకుండా కాలనీల్లో నిల్వ ఉండే నీటిని తరలించడానికి 1,092 కిలో మీటర్ల పొడవున తక్కువ పరిణామం ఉండే పైపులతో మరో పైపులైను నిర్మించి దీన్ని కూడా చెరువులకు కలుపుతారు. 
ఉదాహరణకు నగరంలో భారీ వర్షం పడితే పంజగుట్ట మోడల్‌ హౌస్‌ వద్ద దాదాపు 20 సెంటీమీటర్ల పైబడి వర్షం నీరు అక్కడికి చేరుతుందని జేఎన్‌టీయూ నిపుణులు గుర్తించారు. ఆ నీటిని ఆరు మీటర్ల డయాతో పైపులైను నిర్మించి సమీపంలో నిర్మించే చెరువులోకి తీసుకెళ్తారు. ఈ చెరువు నిండితే దగ్గరలో ఉన్న మరో చెరువులోకి నీటిని మళ్లిస్తారు. 
మరో వైపు నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో రెండు లక్షల ఎకరాల స్థలాలున్నట్లు గుర్తించారు. 
ఆ ప్రాంతంలో పడిన నీరు అక్కడే ఇంకేలా 2.70 లక్షల ఇంకుడు గుంతలు నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రతి ఇంటిలోనూ ఇంకుడు గుంత ఉండేలా కూడా చూడాలని సిఫార్సు చేశారు. 
ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇతర చోట్ల 17,767 నీటి కుంటలు నిర్మిస్తారు. 
ఈ మొత్తం ప్రాజెక్టు అమలుకు రూ.4,953 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. 
మొదటి దశకు రూ.407 కోట్లు అవసరం.  జేఎన్‌టీయూ నిపుణుల బృందం సమర్పించిన నివేదికపై బల్దియా ఇంజినీర్ల బృందం క్షేత్రస్థాయిలో విచారించింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. తుది అనుమతి కోసం ఈ ప్రణాళికను జీహెచ్‌ఎంసీ ప్రభుత్వానికి పంపించింది. పైపులైను నిర్మాణానికి రూ.246 కోట్లు, ఇతరత్రా పనుల కోసం రూ.161 కోట్లను వ్యయం చేయాలని నిర్ణయించారు.

ముంపు ఇబ్బందే ఉండదు 
రెండేళ్లపాటు కష్టపడి నివేదికను రూపొందించాం. నివేదికను జీహెచ్‌ఎంసీ ఆమోదించడం సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్టు అమలు విషయంలో బల్దియా అధికారులకు తోడ్పాటు అందిస్తాం.

- ఫ్రొపెసర్‌ లక్ష్మణరావు, జేఎన్‌టీయూ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం
 

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.