close
ఎందుకిలా జరిగింది? 

తెరాస అంతర్మథనం మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య కనిపించని సఖ్యత 
నేతల మధ్య విభేదాలు, సమన్వయలోపాలు  పూర్తి స్థాయిలో సాగని ప్రచారం 
ఈనాడు - హైదరాబాద్‌

దాదాపు 110 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎమ్మెల్సీలు, 10 మంది జడ్పీ ఛైర్మన్లు, 30 మంది కార్పొరేషన్ల ఛైర్మన్లు, వేలాది మంది ప్రజాప్రతినిధులు.. లక్షలాదిగా కార్యకర్తలు.. ఇంత బలం.. బలగం ఉన్న తెరాస లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. తమ లక్ష్యానికి దాదాపు ఏడు స్థానాలు తగ్గాయి. ఆరు జిల్లాల్లో ఈ ప్రభావం కనిపించింది. ఏడు స్థానాల్లో ఓటమి ఆ పార్టీకి శరాఘాతంగా మారింది. ఓటమిపై  పార్టీ శ్రేణుల్లో అంతర్మథనం మొదలైంది. 
అభ్యర్థుల ఎంపిక లోపం ఇక్కడే.. 
పార్టీ అభ్యర్థుల ఎంపికలో లోపంపై చర్చ జరుగుతోంది. విపక్షాల నుంచి అనుభవజ్ఞులు, ఆర్థిక బలం గల అభ్యర్థులు రంగంలోకి దిగారు. తెరాస తరఫున దీనికి భిన్నమైన వ్యూహాన్ని అవలంబించారు. కొత్త అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చారు. తెరాస ఓడిన మల్కాజిగిరి, నల్గొండ, సికింద్రాబాద్‌ స్థానాల్లో ఈ ప్రభావం కనిపించింది. ఈ మూడు స్థానాల్లో అభ్యర్థులు రాజశేఖర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, తలసాని సాయికిరణ్‌ యాదవ్‌లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇది కాంగ్రెస్‌ అభ్యర్థులు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, భాజపా అభ్యర్థి కిషన్‌రెడ్డిలకు కలిసొచ్చింది. 
కనిపించని కలివిడితనం 
అభ్యర్థుల ఓటమికి తెరాసలో ఉన్న సమన్వయలోపాలు, విభేదాలు కూడా ఒక కారణమనే విశ్లేషణ జరుగుతోంది. మల్కాజిగిరి, నల్గొండ, సికింద్రాబాద్‌, భువనగిరిలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, అభ్యర్థుల మధ్య సమన్వయలోపం కనిపించింది. కలిసి మెలసి పనిచేయాలని సీఎం సూచించినా వారు అంతగా పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించారు. ఉప్పల్‌ శాసనసభ స్థానంలో కేటీఆర్‌ పర్యటన సమాచారం మేయరు బొంతు రామ్మోహన్‌కు తెలియలేదు. కేటీఆర్‌ రోడ్‌షోలలోనూ నేతలు కలివిడిగా లేరు. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లకు కలిపి ఎల్బీస్టేడియంలో సీఎం సభ ఏర్పాటు చేయగా.. అక్కడ తలసాని ఒక్కరే జనసమీకరణ చేశారు. మిగిలిన వారి నుంచి సహకారం లేదు.
అక్కడేం జరిగింది 
సీనియర్‌ ఎంపీ వినోద్‌, నిజామాబాద్‌లో కవిత ఓటమి తెరాసను విస్మయపరిచింది. బలమైన అభ్యర్థుల్లో ఒకరుగా ఆయన ఉన్నారు. ఈ నియోజకవర్గంలో భాజపా అనూహ్యంగా పుంజుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సభతో పాటు భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణుల ప్రచారంతో ఒక్కసారిగా ఈ రెండు నియోజకవర్గాల్లో పరిస్థితి మారిపోయింది. తెరాస మైనారిటీలకు మద్దతుగా ఉందనే వాదనను భాజపా తమకు అనుకూలంగా మార్చుకుంది. నిజామాబాద్‌లో ఎంపీ కవితను ఓడించేందుకు విపక్షాలు ఒక్కటయ్యాయి. అక్కడ రైతులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడం ఎంపీ కవితకు వ్యతిరేకమనే ప్రచారం జరిగింది. పసుపు బోర్డు, దాన్ని సాధించకపోవడం అనే అంశాలను విపక్షాలు తమకు అస్త్రాలుగా వాడుకున్నాయి. భువనగిరిలో బూర నర్సయ్యగౌడ్‌ బలమైన అభ్యర్థిగా ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గంలో ఒక బలమైన వర్గం ఆయనను ఓడించేందుకు ఒక్కటైంది. ఇది కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి లాభించింది. ఆదిలాబాద్‌లోనూ భాజపా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆదివాసీ నేత సోయం బాపురావును పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపింది. తెరాస అభ్యర్థి, ఎంపీ నగేశ్‌ ఆదివాసి అభ్యర్థి అయినా బాపురావు పెద్దఎత్తున ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేసి ఫలితాన్ని రాబట్టుకున్నారు. 
పూర్తి స్థాయి ప్రచారమేదీ? 
శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్‌ విస్తృతంగా పర్యటించారు. దాదాపు 100 సభల్లో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఆయన 17 సభల మేరకే నిర్వహించారు. కొన్నిచోట్ల నియోజకవర్గ కేంద్రాల్లో సభలు జరగలేదు. శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించామనే ధీమా వల్ల లోక్‌సభ ఎన్నికలపై పార్టీ పూర్తి స్థాయి దృష్టి సారించలేదనే విమర్శలున్నాయి. శాసనసభ ఎన్నికల్లో పథకాలు, కార్యక్రమాలపై ఇంటింటికీ ప్రచారం చేశారు. ఈసారి అది జరగలేదు. 
జాతీయాంశాలు 
ఎన్నికల్లో స్థానిక అంశాల కంటే జాతీయ అంశాలను విపక్షాలు ప్రచారం చేశాయి. రాష్ట్రంలో తెరాస ఉన్నట్లే, కేంద్రంలో భాజపా, కాంగ్రెస్‌లుండాలనే కోణంలో వారు ప్రజలను ఓట్లు అడిగారు. తెరాస ఎంపీ స్థానాలు గెలిచినా కేంద్రంలో ప్రభావం చూపలేదని చెప్పగలిగాయి. సికింద్రాబాద్‌లో ఎంపీ కిషన్‌రెడ్డి గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి వస్తుందనే ప్రచారం జోరుగా సాగింది.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.