close

ప్రధానాంశాలు

ఎన్నేళ్లకెన్నేళ్లకు

ఓడినా న్యూజిలాండ్‌ ముందుకు! 
27 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ 
సెమీస్‌లో ఇంగ్లాండ్‌ 
చెస్టర్‌లీస్ట్రీట్‌

జోరు కొనసాగించిన ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. బెయిర్‌స్టో బ్యాట్‌ నుంచి మరో శతకం జాలువారిన వేళ.. న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. రెండు జట్లకూ ఇదే చివరి లీగ్‌ మ్యాచ్‌. మొత్తం ఆరు విజయాలు సాధించిన ఇంగ్లాండ్‌ 12 పాయింట్లతో ముందంజ వేసింది. 1992 తర్వాత ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ చేరడం ఆ జట్టుకు ఇదే తొలిసారి. 

ఫేవరెట్‌ ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆ జట్టు బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 119 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించింది. బెయిర్‌స్టో (106; 99 బంతుల్లో 15×4, 1×6), జేసన్‌ రాయ్‌ (60; 61 బంతుల్లో 8×4) మెరవడంతో మొదట ఇంగ్లాండ్‌ 8 వికెట్లకు 305 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్‌ 45 ఓవర్లలో 186 పరుగులకే కుప్పకూలింది. 14 పరుగులకే ఓపెనర్లిద్దరినీ కోల్పోయిన కివీస్‌ ఏ దశలోనూ కోలుకోలేదు. ఇంగ్లాండ్‌ బౌలర్ల ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. చాలా ముందే కివీస్‌ పరాజయం ఖాయమైంది. లేథమ్‌ (57) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. వుడ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. బెయిర్‌స్టోకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. తొలి ఐదు ప్రపంచకప్పుల్లో సెమీస్‌ చేరిన ఇంగ్లాండ్‌.. ఆరు టోర్నీల తర్వాత ఇప్పుడు మళ్లీ తుది నాలుగులో చోటు సంపాదించింది. 
బెయిర్‌స్టో మళ్లీ..: ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌లో బెయిర్‌స్టో ఆటే హైలైట్‌. వరుసగా రెండో శతకం బాదిన అతడు.. జేసన్‌ రాయ్‌తో కలిసి మరోసారి అద్భుత ఆరంభాన్నిచ్చాడు. గత మ్యాచ్‌లో భారత్‌పై సెంచరీ చేసిన అతడు ఈసారి కూడా చెలరేగి ఆడాడు. బెయిర్‌స్టో ఎడాపెడా ఫోర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రాయ్‌తో తొలి వికెట్‌కు 18.3 ఓవర్లలో 123 పరుగులు జోడించిన అతడు.. ఆ తర్వాత రూట్‌ (24)తో మరో చక్కని భాగస్వామ్యం నెలకొల్పాడు. సౌథీ బౌలింగ్‌లో బౌండరీతో శతకం (95 బంతుల్లో)తో పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌ 30 ఓవర్లలో 191/1తో చాలా పెద్ద స్కోరుపై కన్నేసింది. కానీ మ్యాచ్‌ సాగుతున్నకొద్దీ పిచ్‌ మందకొడిగా మారగా.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కివీస్‌ పోటీలోకి వచ్చింది. బౌల్ట్‌ చక్కని బౌలింగ్‌తో ఇంగ్లాండ్‌కు కళ్లెం వేశాడు. మొదట రూట్‌ (24)ను ఔట్‌ చేసి 71 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీసిన అతడు.. తన తర్వాతి ఓవర్లో బెయిర్‌స్టోనూ వెనక్కి పంపాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ స్వేచ్ఛగా పరుగులు రాబట్టలేకపోయింది. ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. శాంట్నర్‌.. బట్లర్‌ (11), స్టోక్స్‌ (11)లను త్వరగానే వెనక్కి పంపాడు. 42 పరుగులు చేసిన మోర్గాన్‌ 47వ ఓవర్లో ఔటయ్యాడు. ఇంగ్లాండ్‌ చివరి 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 64 పరుగులు మాత్రమే చేయగలిగింది.

పాకిస్థాన్‌ ఔట్‌!

న్యూజిలాండ్‌ తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఓడినా.. సెమీఫైనల్‌ చేరడం దాదాపుగా లాంఛనమే. పాకిస్థాన్‌ నిష్క్రమణ కూడా ఖాయమే. ఎలాగంటే.. అన్ని మ్యాచ్‌లూ ఆడేసిన కివీస్‌ ఇప్పుడు 11 పాయింట్లతో.. ఆస్ట్రేలియా (14), భారత్‌ (13), ఇంగ్లాండ్‌ (12) తర్వాత నాలుగో స్థానంలో ఉంది. ఆ జట్టు నెట్‌    రన్‌రేట్‌ 0.175. 9 పాయింట్లతో ఉన్న పాకిస్థాన్‌ (5వ స్థానం) నెట్‌ రన్‌రేట్‌    -0.792. తన చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిస్తే 11 పాయింట్లతో కివీస్‌ను సమం చేయగలుగుతుంది. కానీ పాకిస్థాన్‌.. రన్‌రేట్‌లో ఆ జట్టును దాటడం దాదాపు అసంభవమే. అలా దాటాలంటే కనీసం 316 పరుగుల తేడాతో నెగ్గాలి. లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే పాకిస్థాన్‌కు సెమీస్‌ చేరే అవకాశమే ఉండదు.

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: జేసన్‌ రాయ్‌ (సి) శాంట్నర్‌ (బి) నీషమ్‌ 60; బెయిర్‌స్టో (బి) హెన్రీ 106; రూట్‌ (సి) లేథమ్‌ (బి) బౌల్ట్‌ 24; బట్లర్‌ (సి) విలియమ్సన్‌ (బి) బౌల్ట్‌ 11; మోర్గాన్‌ (సి) శాంట్నర్‌ (బి) హెన్రీ 42; స్టోక్స్‌ (సి) హెన్రీ (బి) శాంట్నర్‌ 11; వోక్స్‌ (సి) విలియమ్సన్‌ (బి) నీషమ్‌ 4; ప్లంకెట్‌ నాటౌట్‌ 15; రషీద్‌ (బి) సౌథీ 16; ఆర్చర్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 15 
మొత్తం: (50 ఓవర్లలో 8 వికెట్లకు) 305; 
వికెట్ల పతనం: 1-123, 2-194, 3-206, 4-214, 5-248, 6-259, 7-272, 8-301; 
బౌలింగ్‌: శాంట్నర్‌ 10-0-65-1; బౌల్ట్‌ 10-0-56-2; సౌథీ 9-0-70-1; హెన్రీ 10-0-54-2; గ్రాండ్‌హోమ్‌ 1-0-11-0; నీషమ్‌ 10-1-41-2 
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్తిల్‌ (సి) బట్లర్‌ (బి) ఆర్చర్‌ 8; నికోల్స్‌ ఎల్బీ (బి) వోక్స్‌ 0; విలియమ్సన్‌ రనౌట్‌ 27; టేలర్‌ రనౌట్‌ 28; లేథమ్‌ (సి) బట్లర్‌ (బి) ప్లంకెట్‌ 57; నీషమ్‌ (బి) వుడ్‌ 19; గ్రాండ్‌హోమ్‌ (సి) రూట్‌ (బి) స్టోక్స్‌ 3; శాంట్నర్‌ ఎల్బీ (బి) వుడ్‌ 12; సౌథీ నాటౌట్‌ 7; హెన్రీ (బి) వుడ్‌ 7; బౌల్ట్‌ (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) రషీద్‌ 4; ఎక్స్‌ట్రాలు 14 
మొత్తం: (45 ఓవర్లలో ఆలౌట్‌) 186; 
వికెట్ల పతనం: 1-2, 2-14, 3-61, 4-69, 5-123,   6-128, 7-164, 8-166, 9-181; 
బౌలింగ్‌: వోక్స్‌ 8-0-44-1; ఆర్చర్‌ 7-1-17-1; ప్లంకెట్‌ 8-0-28-1; వుడ్‌ 9-0-34-3; రూట్‌ 3-0-15-0; రషీద్‌ 5-0-30-1; స్టోక్స్‌ 5-0-10-1


 

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.