close

ప్రధానాంశాలు

చౌక సరకు.. ఎక్కడైనా దొరకు!

దేశమంతటా ఒకే పోర్టబిలిటీ విధానం 
రేషన్‌ తీసుకోడానికి వెసులుబాటు 
పాలమూరు వలసజీవులకు ఊరట 
న్యూస్‌టుడే, పెద్దకొత్తపల్లి

చౌక ధర దుకాణాల ద్వారా పేదలు ప్రస్తుతం ఈ- పోస్‌ విధానంతో రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా సరకులను పొందుతున్నారు. ఇదే మాదిరిగా దేశంలో ఎక్కడైనా రేషన్‌ సరకులను పొందే విధానానికి ఇటీవల కేంద్రం పచ్చజెండా ఊపింది. మొదట దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలులోకి తీసుకొస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ విధానాన్ని అమలుచేయనుండటంతో ఇతర రాష్ట్రాల్లో జీవనోపాధి పొందుతున్న పేదలకు లబ్ధి కలగనుంది. ఒకే దేశం.. ఒకే కార్డు విధానాన్ని కేంద్రం ఆచరణలోకి తీసుకురానుండటంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ముంబయి, బెంగళూరు, చెన్నై తదితర రాష్ట్రాలకు జీవనోపాధి కోసం వెళ్తున్న వలసజీవులకు ఊరట కలగనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వం పేదలకు ఆహారభద్రత చట్టం కింద రూపాయికే కిలో బియ్యాన్ని చౌకధర దుకాణాల ద్వారా ప్రతినెలా అందజేస్తోంది. అయితే.. స్థానికంగా జీవనోపాధి లేక ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న వారికి రేషన్‌ సరకులు అందడం లేదు. వీరికి సంబంధించిన సరకులను డీలర్లు నల్లబజారులో విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఇలాంటి అక్రమాలకు నిలువరించడానికి రెండేళ్ల కిందట..లబ్ధిదారుల వేలిముద్రలు వేస్తేనే రేషన్‌ సరకులు జారీ అయ్యేలా ఈ పోస్‌  పోర్టబులిటీ విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఈ విధానాన్ని రాష్ట్ర పరిధిలోనే ఏర్పాటుచేయడంతో హైదరాబాద్‌, మెదక్‌, రంగారెడ్డి తదితర ప్రాంతాలకు వలస వెళ్లేవారికే ఉపయోగపడుతోంది. ఉదాహరణకు పెద్దకొత్తపల్ల్లి మండలానికి చెందిన కుటుంబం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలసవెళ్తే అక్కడే ఈ విధానంలో రేషన్‌ సరకులు పొందే వెసులుబాటు కల్పించింది. ఇదివరకు ఎక్కడికి వెళితే అక్కడికి రేషన్‌కార్డు బదిలీ చేయించుకోవాల్సి వచ్చేది. దీంతో వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారు ఇబ్బందులు పడాల్సి వచ్చేది.

దేశవ్యాప్తంగా వెసులుబాటు 
రాష్ట్రంలో అమలులోఉన్న ఈ- పోస్‌ పోర్టబులిటీ విధానాన్ని అమలుచేయడానికి కేంద్రం మరో ముందడుగు వేసింది. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని నిర్ణయించడంతో ప్రజలకు మరింత వెసులుబాటు కలగనుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి సుమారు 30 వేల కుటుంబాలు ఏటా జీవనోపాధి కోసం మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిషా, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని నారాయణపేట, కొల్లాపూర్‌, పెద్దకొత్తపల్లి, లింగాల తదితర మండలాల నుంచి ఎక్కువ సంఖ్యలో వలస వెళ్తుంటారు. ఆయా రాష్ట్రాల్లో రేషన్‌ సరకులు అందని పరిస్థితి. దీంతో వలసజీవులు అధిక ధరలకు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. కూలీ చేయగా వచ్చే డబ్బులో సగం నిత్యావసర సరకులకే ఖర్చవుతుండటం వలసజీవులకు గోటిచుట్టూ రోకలిపోటులా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్తగా అమలులోకి తీసుకురానున్న పోర్టబిలిటీ విధానంతో ఉమ్మడి జిల్లాలోని వలస జీవులకు మేలు కలగనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.