close

ప్రధానాంశాలు

దొంగలు అరెస్టు

మూడు ద్విచక్ర వాహనాలు, 10 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: వరుస దొంగతనాలకు పాల్పడుతూ.. మండల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఐదుగురు అంతరాష్ట్ర దొంగలను అశ్వారావుపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు ద్విచక్ర వాహనాలను, 10 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఐదు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అశ్వారావుపేట సీఐ అబ్బయ్య తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం, కుక్కునూరుకు వెళ్లే రహదారిలో పోలీసులు మంగళవారం సాయంత్రం వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో సప్కా కాంతారావు, సాశం ప్రభాకర్‌ ఒక ద్విచక్ర వాహనంపై, మహ్మద్‌ అహ్మద్‌, పాయం అనిల్‌, షేక్‌ నాగు మరో ద్విచక్ర వాహనంపై కుక్కునూరు వైపు వెళ్తున్నారు. పోలీసులు తనిఖీ గమనించిన వారు వాహనాలను వెనక్కి తిప్పి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈలోగా పోలీసులు వారి వద్దకు వెళ్లి వారి ద్విచక్ర వాహనాలకు సంబంధించిన పత్రాలు అడిగారు. దీంతో వారు తత్తర పాటుగా సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులు వారిని తనిఖీ చేయగా వారి వద్ద బంగారు ఆభరణాలు లభించాయి. ఈ ఆభరణాల గురించి అడగ్గా వారు పొంతనలేని సమాధానాలు చెప్పటంతో వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారించినట్లు సీఐ తెలిపారు. దీనిపై సీఐ బుధవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితులను వారు చోరీ చేసిన బంగారు ఆభరణాలను, ద్విచక్ర వాహనాలను చూపించారు.

వీడిన మిస్టరీ..
అశ్వారావుపేట మండలంలో గత రెండు నెలల్లో వరుసగా ఎనిమిది చోరీలు జరిగాయి. దీంతో మండల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఐదుగురు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు పట్టుకుని విచారించడంతో మండలంలో జరిగిన దొంగతనాలు తామే చేసినట్లు వారు ఒప్పుకోవడంతో పాటు వారు దొంగిలించిన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో వరుస చోరీల మిస్టరీ వీడింది. మండలంలోని ఆసివారిగూడెంలో ఓ రైతు ఇంట్లో 10 గ్రాముల, కొత్తూరులో ఓ ఇంట్లో 9.5 కాసుల బంగారు ఆభరణాలు, గుమ్మడవల్లిలో ఓ ఇంట్లో ఒక కాసు బంగారు ఆభరణాలు, మూడు జతల వెండి పట్టీలు, జమ్మిగూడెంలో రైతు ఇంట్లో ఐదు కాసుల బంగారు ఆభరణాలు, కుక్కునూరు మండలం అర్వాపల్లికి చెందిన ఆటో ప్రయాణిస్తున్న మహిళ వద్ద నుంచి బంగారపు గొలుసును దొంగిలించినట్లు తేలింది. అంతేకాక అశ్వారావుపేటలో మూడు ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు తమ విచారణలో తేలిందని సీఐ తెలిపారు. వీరు దొంగిలించిన సొత్తు విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 10 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని, ఇంకా కొంత బంగారం జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలో తాకట్టు పెట్టినట్లు ముద్దాయిలు తెలిపారని, వాటిని కూడా త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని సీఐ తెలిపారు.

రెండు రాష్ట్రాల్లో పలు చోరీలు
సప్కా కాంతారావు, మహ్మద్‌ అమ్మద్‌, షేక్‌ నాగు ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతానికి చెందిన వారు. కాగా పాయం అనీల్‌, పాశం ప్రభాకర్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందినవారని సీఐ తెలిపారు. ఈ ఐదుగురు బృందంగా ఏర్పడి రెండు రాష్ట్రాల్లో పలు చోరీలకు పాల్పడుతూ.. ఇప్పటికే పలుమార్లు జైలు శిక్ష అనుభవించారని తెలిపారు. అశ్వారావుపేట పోలీసులు కూడా వీరిని గతంలో చోరీ కేసులో అరెస్టు చేశామన్నారు. కుక్కునూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చేసిన చోరీ కేసులో రెండు నెలల క్రితం వరకు జైలులో ఉండి మేలో విడుదలయ్యారన్నారు. బయటకు వచ్చి మళ్లీ చోరీలకు పాల్పడ్డారని సీఐ తెలిపారు. నిందితులను సత్తుపల్లి న్యాయస్థానంలో ప్రవేశపెట్టినట్లు, న్యాయమూర్తి వారికి రిమాండ్‌ విధించినట్లు సీఐ తెలిపారు.పోలీసులకు ప్రశంస
చోరీలకు పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు వారు దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు శ్రీను, ప్రసాద్‌, రమేశ్‌, సత్యనారాయణ, రవి, కృష్ణను సీఐ అబ్బయ్య అభినందిచారు. సమావేశంలో దమ్మపేట ఎస్సై తిరుపతి, శిక్షణ ఎస్సై రవికుమార్‌ పాల్గొన్నారు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.