close
ఉస్మానయా హంగులు 

ఆసుపత్రి పురాతన భవనం ఆధునికీకరణకు రంగం సిద్ధం 
రూ.25 కోట్లతో హెరిటేజ్‌ శాఖ ఆధ్వర్యంలోనే మరమ్మతులు 
పురాతన భవనంలోని 400 పడకల సర్దుబాటుకు కసరత్తు 
ఈనాడు - హైదరాబాద్‌

చారిత్రక వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన పురాతన ఉస్మానియా ఆసుపత్రి భవనానికి కొత్త సొబగులు అద్దనున్నారు. దాదాపు రూ.25 కోట్లతో హెరిటేజ్‌ శాఖ ఆధ్వర్యంలోనే మరమ్మతులు చేపట్టనున్నారు. అప్పటివరకు పురాతన భవనంలో ప్రస్తుతమున్న 400 పడకలను అదే ప్రాంగణంలోని ఇతర భవనాల్లో సర్దుబాటు చేయనున్నారు. పడకల సర్దుబాటుపై వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. 
యథాతథంగా పురాతన భవనం 
పురాతన ఉస్మానియా ఆసుపత్రి భవనం క్రమేణా పగుళ్లు బారి పెచ్చులూడుతోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంగణంలోనే నూతనంగా బహుళ అంతస్తుల భవనం నిర్మించాలని నాలుగేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినా..ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఏటా వర్షా కాలంలో స్లాబు నుంచి నీళ్లు కారడం, పెచ్చులూడడం వంటి ఘటనలు సర్వసాధారణమయ్యాయి. చివరికి శస్త్ర చికిత్స గదుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో వైద్యులు, రోగులు బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సత్వరమే ఉస్మానియా వారసత్వ భవనానికి మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవన రూపురేఖలు ఏమాత్రం మార్చకుండా యథాతథంగా ఆధునికీకరించనుంది. తొలుత మరమ్మతుల బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ)కి అప్పగించాలని భావించినా తాజాగా ఆ ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంది. ఇటువంటి పనుల్లో అనుభవమున్న హెరిటేజ్‌ శాఖకు పనులు అప్పగించాలనే నిర్ణయానికొచ్చింది. పనులకు గానూ రూ.25 కోట్లు పురావస్తు శాఖ ద్వారా విడుదల చేయించేందుకు అనుమతులు పూర్తయ్యాయి. 
కనీసం రెండేళ్లు 
ఆధునికీకరణ పూర్తయ్యేందుకు కనీసం రెండేళ్లు పడుతుందని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘‘ఈ తరహా నిర్మాణాల్లో ఆరితేరిన సంస్థలను టెండరు విధానంలో ఎంపిక చేస్తారు. ఇందుకు కనీసం ఆర్నెల్ల సమయం, పనులు పూర్తిచేయడానికి సుమారు ఏడాదిన్నర సమయమైనా పడుతుంది. మరమ్మతుల్లో భాగంగా ప్రధానంగా స్నానాల గదులు, మరుగుదొడ్ల నీరు బయటకు వెళ్లకపోవడం, మురుగు వ్యవస్థలో లోపాలు తదితర సమస్యల్ని చక్కదిద్దుతారు’’ అని వైద్య వర్గాలు తెలిపాయి. 
పడకల సర్దుబాటే అసలు సవాల్‌ 
గతంలో ఉస్మానియాలోని 400 పడకలను సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆసుపత్రి, కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రి సహా మరికొన్నింటిలో సర్దుబాటు చేయాలని భావించినా అక్కడికి వెళ్లి వైద్యసేవలందించడానికి వైద్యులు, నర్సులు నిరాకరించారు. ఈ దృష్ట్యా ఉస్మానియా ప్రాంగణంలోని ఇతర భవనాల్లోనే 400 పడకలను సర్దుబాటు చేయాలని తాజాగా నిర్ణయించారు. ఇటీవలే ఆధునికరించిన హౌస్‌ సర్జన్ల భవనంలో 100 పడకలు, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రోగుల సహాయకుల కోసం ఏర్పాటుచేసిన రాత్రి వసతి గృహంలో 40, కులీ కుతుబ్‌షా భవనంలోని ఐదో అంతస్తులో 200, ఇదే భవనంలోని వేర్వేరు స్పెషలిస్టు వార్డుల్లో మరో 20, శస్త్ర చికిత్స గదులున్న భవనంలో 40 పడకలను సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అనుమతులు కోరుతూ టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ సోమవారం వైద్యారోగ్య శాఖకు లేఖ రాసింది.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.