close
ఇటు ప్రేమ.. అటు వలపు!

షిగాజె: అతడు హన్‌.. ఆమె టిబెటన్‌. రెండు జాతుల మధ్య తీవ్ర వైరం ఉన్నా.. చరిత్రను తిరగరాసి తమ ప్రేమతో ఇరు జాతులను దగ్గర చేశారు. లాంగ్‌ షి ఝాంగ్‌, బా సంగ్‌ క్వె బా.. వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. కానీ వారి ప్రేమకు ఎన్నో అడ్డంకులు. హన్‌, టిబెటన్‌ జాతుల మధ్య వైరం కారణంగా చాలా ఏళ్ల పాటు పెళ్లి చేసుకోలేకపోయారు. ఎట్టకేలకు 2015లో వాళ్ల పెళ్లయింది. ఇప్పుడు ఇద్దరూ 50లలో ఉన్నారు. ఈ వృద్ధ దంపతులు టిబెట్‌ అటానమస్‌ ప్రాంతంలో జాతుల ఐక్యతకు నిదర్శనంగా నిలిచారు. వాళ్లిద్దరి పెళ్లి ఆ తర్వాత కొన్ని వందల జంటలు ఒక్కటయ్యేందుకు కారణమైంది. దాంతో స్థానిక ప్రభుత్వం వీరిద్దరినీ ‘జాతీయ ఆదర్శప్రాయులు’ అవార్డుతో గౌరవించింది. షిగాజెలోని ఒక ప్రధాన కమ్యూనిటీ సెంటర్‌లో లాంగ్‌, బా ఫొటోలను ప్రదర్శిస్తున్నారు. చైనా ఆహ్వానంతో కొందరు భారతీయ పాత్రికేయులు టిబెట్‌ వెళ్లినపుడు అక్కడి అధికారి సి డాన్‌ యాంగ్జి ఈ వివరాలు తెలిపారు. వివిధ జాతుల మధ్య పెళ్లిళ్లను ప్రోత్సహించడం ద్వారా ఆయా జాతుల ఐక్యతను పెంపొందిస్తున్నామన్నారు. సమాజంలో చాలామందికి లాంగ్‌, బా ఆదర్శంగా నిలిచారన్నారు. తమ పెళ్లయితే ఘర్షణలు జరుగుతాయని వాళ్లు చాలాకాలం ఆగడమే శాంతికి బాటలు వేసిందన్నారు.

 తాయ్‌పేయ్‌: పొరుగు దేశమైన తైవాన్‌ వారిమీద వలపు పేరుతో వల విసిరి.. వారిని కోట్లాది రూపాయల మేర ముంచేస్తున్నారు కొందరు హాంకాంగ్‌, చైనా పౌరులు! వారిని పట్టుకోడానికి సాయం చేయాలని ఆ రెండు దేశాలను తైవాన్‌ కోరింది. విదేశీయులను మోసం చేయడంలో ఇదో కొత్తరకం. చైనా, హాంకాంగ్‌ దేశాల్లో ఉండే మోసగాళ్లు.. సామాజిక మాధ్యమాల్లో తైవానీయులను స్నేహితులుగా చేసుకుని వారిని శృంగార సంభాషణల్లోకి దించుతున్నారు. తర్వాత కొన్ని బూటకపు కంపెనీల పేర్లు చెప్పి, వాటిలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మబలుకుతున్నారు. ఇలా దాదాపు 500 మంది తైవానీయులు రూ. 206 కోట్ల మేర నష్టపోయారు. వారిలో అత్యధికంగా ఒక వ్యక్తి రూ. 13.73 కోట్లు కోల్పోయాడు. హాంకాంగ్‌లో ఉన్న కొన్ని బ్యాంకు ఖాతాలకు డబ్బులు పంపాలని బాధితులను అవతలివాళ్లు కోరేవారు. వాటిని షేర్లు, విదేశీ కరెన్సీ, బంగారం, ఫ్యూచర్లలో పెట్టుబడులు పెడతామని చెప్పేవారు. తమ డబ్బు వెనక్కి తీసుకుందామని ప్రయత్నించేవరకు వారికి అసలు విషయం తెలియలేదు. 2016లో డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీకి చెందిన ట్సై ఇంగ్‌ వెన్‌ అధ్యక్షురాలైన తర్వాతి నుంచి చైనా, తైవాన్‌ మధ్య సంబంధాలు అంత బాగోలేవు. ఈ నేపథ్యంలో విచారణకు చైనా ఎంతవరకు సహకరిస్తుందనేది అనుమానమే.

 

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.