close
చిన్నపేగు చికిత్సలో పెద్ద పురోగతి 

ఏషియన్‌ గ్యాస్ట్రోఎంటరాలజీలో అందుబాటులోకి..

ఈనాడు, హైదరాబాద్‌: అన్నవాహిక, జీర్ణాశయంలో సమస్యలొస్తే నోటినుంచి ఎండోస్కోపీ.. పెద్దపేగులో సమస్యను గుర్తించాలంటే కిందినుంచి కొలనోస్కోపీ చికిత్సలు ఇప్పటికే ప్రాచుర్యం పొందాయి. కానీ జీర్ణాశయానికి, పెద్దపేగుకు మధ్యలో ఉండే చిన్నపేగుల్లో సమస్యలొస్తేనే గుర్తించడం వైద్య నిపుణులకూ కఠినతరమవుతోంది. ఈ అడ్డంకిని కూడా ఇప్పుడు అధిగమించారు మన వైద్యులు. జీర్ణాశయ వ్యాధుల చికిత్సలకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘ఏషియన్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ సంస్థ(ఏఐజీఈ)’కు చెందిన వైద్య నిపుణులు తాజాగా చిన్నపేగుల్లో వచ్చే అనారోగ్య సమస్యలను గుర్తించడం, చికిత్స అందించే ‘పవర్‌ స్పైరల్‌ ఎంటెరోస్కోపీ’ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఆసియా-పసిఫిక్‌ దేశాలన్నింటిలో జపాన్‌లో మాత్రమే ఈ నూతన సాంకేతిక విధానం అమల్లో ఉండగా.. ఇప్పుడు మన దేశంలోనూ ఈ ఆధునిక చికిత్సను అందుబాటులోకి తెచ్చారు. ఈ చికిత్స విశేషాలపై శుక్రవారం నిర్వహించిన కార్యశాలలో ఏఐజీఈ ఛైర్మన్‌, ప్రఖ్యాత జీర్ణాశయ వ్యాధి నిపుణులు డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి, డాక్టర్‌ జీవీ రావు, డాక్టర్‌ మోహన్‌ రామచందానీ వివరాలు వెల్లడించారు.

ఏమిటి దీని ప్రత్యేకత? 
చిన్నపేగులు సుమారు 22 అడుగుల పొడవుంటాయి. అది కూడా వంకలుగా ఉంటాయి. 
ఇందులోకి ఎండోస్కోపీ ద్వారా కొంత మేర చిన్నపేగు తొలి భాగాన్ని పరిశీలించే అవకాశమున్నా.. అది పూర్తిస్థాయిలో చికిత్సకు దోహదపడడం లేదు. సీటీ, ఎంఆర్‌ఐ వంటి స్కాన్‌లు తీసినా.. సమస్యను సమగ్రంగా గుర్తించడం సాధ్యం కావడం లేదు. 
‘పవర్‌ స్పైరల్‌ ఎంటెరోస్కోపీ’ ద్వారా సులువుగా చిన్నపేగుల్లోకి దూసుకెళ్లొచ్చు. ఇది ఎవరూ బలంగా నెట్టకుండానే లోనికి వెళ్లిపోతుంది. 
ప్రత్యేక యంత్రం సహాయంతో ఎంటెరోస్కోపీని నోటి ద్వారా లేదంటే మలద్వారం నుంచి గానీ చిన్నపేగుల్లోకి పంపిస్తారు. 
ఇది చిన్నపేగులను క్షుణ్ణంగా పరిశీలించడానికి నిర్ధారణ పరీక్ష పరికరంగా, అక్కడేమైనా అడ్డంకులు ఉంటే తొలగించడానికి చికిత్స పరికరంగా.. రెండు రకాలుగానూ ఉపయోగపడుతుంది.

ఎవరికి ఉపయోగం? 
చిన్నపేగుల్లో క్యాన్సర్‌ కణతులు

రక్తస్రావం 
పేగుల్లో అడ్డంకులు వంటి సమస్యలున్న వారిలో దీని ద్వారా గుర్తించడమే కాకుండా వెంటనే చికిత్స కూడా చేయవచ్చు. 
ముఖ్యంగా క్యాన్సర్‌ తొలిదశలో ఉన్నప్పుడు ఎటువంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా కణతులను తొలగించవచ్చు.

విప్లవాత్మకమైన పురోగతి 
చిన్నపేగుల చికిత్సల్లో ఇది విప్లవాత్మకమైన పురోగతి. గత అయిదేళ్లుగా దీనిపై పరిశోధన చేస్తున్నాం. తొలుత జపాన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మన ప్రభుత్వం నుంచి కూడా అనుమతులొచ్చాయి. సాధారణంగా చిన్నపేగులో గడ్డలు వంటి అడ్డంకులను తొలగించే శస్త్రచికిత్సకు సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చవుతుండగా.. ఈ అధునాతన చికిత్స వల్ల నాలుగో వంతు ఖర్చు తగ్గుతుంది.

- డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి, ఏఐజీఈ ఛైర్మన్‌

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.