close
నఖ శిఖం ఆక్రమణం!

చెరువుల శిఖం భూముల్లో కబ్జాలు, భవనాల నిర్మాణం
పట్టణ ప్రాంతాల్లో కనుమరుగవుతున్న నీటి వనరులు
 ప్రమాదంలో భూగర్భ జలమట్టం
ఈనాడు - హైదరాబాద్‌

నీటి వనరులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. స్థిరాస్తి వ్యాపారం.. భవన నిర్మాణాలతో చెరువులు, కుంటలను చెరపడుతున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా చాలా పట్టణాల్లో ఇప్పటికే జల వనరుల ఉనికి తగ్గిపోతోంది. చెరువులు, కుంటల్లోకి నీళ్లు వచ్చే పాటు కాలువలను మొదట ఆక్రమించుకుని అనంతరం చెరువులను కబ్జాచేస్తున్న పరిస్థితులు అన్నిచోట్లా ఉన్నాయి. వాల్టా చట్టం కింద నీటి వనరులను సంరక్షించేందుకు ప్రభుత్వ విభాగాలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినా.. క్షేత్రస్థాయిలో వాటి అమలు మాత్రం కనిపించడం లేదు. రాష్ట్రంలో నీటి వనరుల ఉనికి తగ్గిపోతున్న పరిస్థితుల్లో భూగర్భ జల మట్టం ఏటికేడు పడిపోవడం ఆందోళనకర పరిణామం.

ఆక్రమణలు కొన్ని..
* హైదరాబాద్‌ నగర శివారులోని పటాన్‌చెరు ఆక్రమణలకు అడ్డాగా మారుతోంది. అమీన్‌పూర్‌ మండలంలోనూ పలు చెరువులు కబ్జాకు గురయ్యాయి. అనేక నీటి వనరులు మాయమై వాటి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి.
* ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని చెరువుల్లోని దాదాపు 2,200 ఎకరాల్లో ఆక్రమణలు వెలిశాయి. వాటి శిఖం ధ్వంసమైపోతోంది.
* మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, కల్వకుర్తి తదితర చోట్ల చెరువుల్లో నిర్మాణాలతోపాటు కొన్నిచోట్ల భూములకు పట్టాలు పొంది కబ్జాలను శాశ్వతం చేసుకున్నారు.
* మెదక్‌ జిల్లా నర్సాపూర్‌, సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల చెరువు శిఖం భూముల్లో స్థిరాస్తి వెంచర్లు వెలిశాయి.

భవిష్యతుకు పొంచి ఉన్న ముప్పు
* రాష్ట్రంలో ఏటా సగటున 1.5 మీటర్ల లోతుకు భూగర్భ జల మట్టం పడిపోతోంది.
* నీటిని నిల్వ చేసి నేలలోకి ఇంకించే కుంటలు, చెరువుల సంఖ్య తగ్గిపోవడంతో భూగర్భం పొరలు ఎండిపోతున్నాయి.
* రాష్ట్రంలో 18 శాతం భూభాగంలో 20 మీటర్ల లోతుకుపైనే మట్టం పడిపోయినట్లు భూగర్భ జలవనరుల శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
* బోర్లకు జీవం పోసేది నీటి వనరులే. నేలలో తేమ శాతాన్ని కాపాడేది కూడా ఇవే. కానీ, వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారి భవిష్యత్తుకు ప్రమాద ఘంటికలు మొగుతున్నాయి.


స్థిరాస్తి వ్యాపార పడగ

నగరాలు, పట్టణ ప్రాంతాల్లో జనసాంద్రతతోపాటు ఆవాసాల సంఖ్య పెద్దఎత్తున పెరుగుతోంది. దీంతో ఖాళీగా ఉన్న భూములు కనుమరుగవుతున్నాయి. ప్రైవేటు భూముల ధరలు పెరగడం వల్ల ప్రభుత్వ భూముల్లో కబ్జాలు చోటుచేసుకుంటున్నాయి. స్థిరాస్తి వ్యాపారులు రాత్రికి రాత్రి ఈ భూముల్లో పాగా వేస్తున్నారు. చెరువుల శిఖం, కట్ట ప్రాంతాలను చదును చేసి విక్రయిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలనలోకి తీసుకోకుండానే రెవెన్యూ శాఖ పట్టాలు జారీ చేస్తున్న పరిస్థితులు అనేకం ఉన్నాయి. ఆ తరువాత ఆక్రమణల తొలగింపు న్యాయ వివాదాలకు కారణమవుతోంది. చెరువుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకాన్ని చేపట్టింది. ఇదే తరహాలో వాటి పరిరక్షణకు కూడా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.